Tuesday, November 26, 2024

జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రచారం చేసేందుకు జీ-20 వేదికను వినియోగిస్తామని సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి వెల్లడించారు. రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు ఆమె బదులిస్తూ ఈ విషయం తెలిపారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన సంస్కృతి పరిరక్షణకు, చోరీకి గురై దేశం నుంచి తరలిపోయిన ప్రాచీన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అలాగే జీ20 వేదికగా భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సవివరంగా సమాధానాలు చెప్పారు. జీ-20 వేదికపై భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబచేసే దిశగా ప్రభుత్వం జీ-20 భాగస్వామ్య దేశాలన్నింటితోను సంప్రదింపులు జరుతున్నట్లు మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు.

చోరీకి గురైన ప్రాచీన కళాఖండాలను తిరిగి దేశాలను రప్పించే విషయంలో యునెస్కో ఒడంబడికకు లోబడి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఒడంబడికపై సంతకాలు చేసిన రెండు దేశాల మధ్య ఆయా దేశాల వారసత్వ సంపదను పర్సపరం కాపాడాలి. దీనికి సంబంధించి ఇటీవలే స్కాట్‌లాండ్‌ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపినట్లు చెప్పారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇదో నిరంతర ప్రక్రియ. చోరీకి గురై విదేశాలకు తరలిపోయిన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించే ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మంత్రి తెలిపారు. చోరీకి గురైన కళాఖండాలకు సంబంధించి సరైన వివరాలు లేకపోవడం, చోరీ జరిగినట్లు రిపోర్టు కాకపోవడం వంటి తగిన డాక్యుమెంట్‌ ఆధారాలు లభ్యం కానందున ఈ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement