న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విద్యుత్తు బిల్లుల వసూళ్లలో వివక్ష లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో బిల్లులు కట్టిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు (వీహెచ్) అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్తు బిల్లు వసూలు చేయడానికి వెళ్లిన అధికారిపై ఎంఐఎం ఎమ్మెల్యే దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక వర్గం ప్రజలు తాము బిల్లులు కట్టే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నా.. అధికారులు, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) ఓటుబ్యాంకు రాజకీయాలతో ముస్లిం వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగతా ప్రాంతాల్లోని ప్రజలు సైతం బిల్లులు కట్టబోమంటూ మొండికేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, ప్రజలు బిల్లులు కట్టకపోతే అవి ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే ఒక వర్గం ప్రజలు బిల్లులు కట్టకపోయినా చూస్తూ ఊరుకోవడం కాదని, చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయడమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్తు బిల్లులు, ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఇదే పరిస్థితి ఉండేదని, అయితే వసూళ్ల కోసం ప్రభుత్వ ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండేది కాదని వ్యాఖ్యానించారు.
కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ఎంఐఎంకు లొంగిపోయిందని ఆరోపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం ఇలాంటి చర్యలను ప్రోత్సహించవద్దని హితవు పలికారు. ప్రజలు పొందే సేవలకు బిల్లులు కడితేనే ఆ సేవలు సక్రమంగా అందుతాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులు, ముస్లింలు, పాతబస్తీ, ఇతర ప్రాంతాలు అన్న తేడా లేకుండా సేవలు పొందే ప్రతి ఒక్కరితోనూ బిల్లులు కట్టిస్తామని, చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తామని వీహెచ్ వ్యాఖ్యానించారు.