ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : కరీంనగర్ క్రీడా పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, కోచ్‌లను నియమిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతకు ముందు కరీంనగర్ లోని స్పోర్ట్స్ పాఠశాలలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ లోని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ టి ఎల్ కింద చెరువుల్లో నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన కట్టడాలపై చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రభుత్వ చెరువులను భూములను ఆక్రమ కట్టడాలు చేపడితే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించదన్నారు. ఎంత వారినైనా ఉపేక్షించకుండా ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో గంజాయిని సరఫరా చేస్తున్న వారిపై ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతున్నామని, గంజాయి నిర్మూలించేందుకు సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి గంజాయిని రాష్ట్రంలో లేకుండా చేస్తామన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలలో ఈత కొలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రీడా పాఠశాలలో క్రీడాకారులకు అవసరమైన వివిధ రకాల ఆటవస్తువులను ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులతో మమేకమైన మంత్రి వారి కావాల్సిన సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న పోషకాహారం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్రీడాకారులకు ట్రాక్‌సూట్‌తో పాటు స్పోర్ట్స్ షూలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన యోగా, కరాటే, జిమ్నాస్టిక్స్ ఆకట్టుకున్నారు. ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ లోని స్పోర్ట్స్ పాఠశాలలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపూల్ దేశయ్, మున్సిపల్ కమిషనర్ చాయత్ బాజ్‌పెయ్, అర్‌డిఓ మహేశ్వర్, డి.వై.ఎస్.ఓ శ్రీనివాస్ గౌడ్, క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ లీలాప్రసాద్ పాల్గొన్నారు.