- రిస్టోర్ చేసేదాకా పోరాటం ఆపేది లేదు
- గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ముందు బీఆర్‌ఎస్, బీజేపీ ఆందోళన
- అధికారుల నిర్లక్ష్య ఫలితమే కుంట ఆక్రమణ
- వర్రకుంట ఆక్రమణ పై జిల్లా కలెక్టర్, మంత్రి స్పందించాలి
వర్రకుంటను కాపాడేదాకా పోరాటం ఆపేది లేదు.. ఎంత వరకైనా ఉద్యమిస్తాం.. జలవనరులు లేకుంటే భవిష్యత్తు లేదు. మా చిన్న నాట కుంటను చూస్తూనే పెరిగాం.. కుంటలోనే ఈదాం.. కుంటలోనే ఆటలాడాం.. ఇప్పుడు కుంటనే లేదంటే ఎట్లా.. కుంటను కబ్జా చేయడమే కాకుండా నామరూపం లేకుండా అందులో విల్లాలను నిర్మిస్తున్నారు. ఇంత దారుణమా.. భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతాం.. బిల్డర్లు అత్యాశకు పోయి మొత్తానికే వర్రకుంటను లేకుండా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు.. దాదాపు 10 రోజులుగా పత్రికల్లో వార్తలు వస్తే అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరించడమేమిటి.. జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు స్పందించి వర్రకుంట పై ఓ ఉన్నత కమిటీని వేసి వెంటనే రిస్టోర్ చేసి తిరిగి వర్రకుంట ఉనికి కాపాడాలని బొల్లారం అధికార పార్టీ బీఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీ గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ముందు గురువారం ఉదయం ఆందోళనకు దిగింది. గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేటు ముందు పనులు ఆపాలని నినాదాలు చేశాయి. ఆంధ్రప్రభ అక్షరపోరాటం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నా బాధ్యతాయుతమైన శాఖలు మాత్రం ఇంకా చర్యలకు వెనకడుగు వేస్తుండటం విడ్డూరంగా ఉందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్)
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారం ఇండస్ట్రీయల్ పరిధిలో దశాబ్ధాల చరిత్ర ఉన్న వర్రకుంటను గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు తన వక్రబుద్దితో ఆక్రమించడమే కాకుండా అందులో 86 విల్లాలకు నిర్మాణ అనుమతులు తెచ్చుకుని విల్లాలను నిర్మించేస్తుంది. ఇదే విషయమై ఆంధ్రప్రభ గత 8 రోజులుగా అక్షరపోరాటం చేస్తూ గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు దమన నీతిని ఎండగడుతూ వస్తుంది. ఆంధ్రప్రభతో పాటు మేడ్చల్ జిల్లా నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ప్రజావాణితో పాటు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. దీని పై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మండల స్థాయిలో ఓ సారి, జిల్లా స్థాయిలో గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు నిర్మిస్తున్న విల్లాల వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. మండల స్థాయి అధికారులు విచారణ చేసినప్పుడే విల్లాలను ఆపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ జిల్లా స్థాయి అధికారులు వచ్చిన సమయంలో తూతూ మంత్రంగా వచ్చి వెళ్లిపోయారు. మండల స్థాయి అధికారులు విల్లాల నిర్మాణాన్ని ఆపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినప్పటికి గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు మాత్రం విల్లాల నిర్మాణాన్ని ఆపేదిలేదంటూ చకచకా పనులు కానిచ్చేస్తుంది. అధికారులు నివేధిక సమర్పించడంలో తాత్సారం చేస్తుండటంతో గ్రేటర్ ఇన్‌ఫ్రా మాత్రం విల్లాల నిర్మాణ వేగాన్ని మరింత పెంచింది.
వర్రకుంటను కాపాడుకుంటాం..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారం ఇండస్ట్రీయల్‌లో ఉన్న వర్రకుంట ఆక్రమణపై ఆంధ్రప్రభలో వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ముందు అధికార బీఆర్‌ఎస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీ వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు, వర్రకుంటలో నిర్మాణ అనుమతులు ఇచ్చిన హెచ్‌ఎండిఏకు వ్యతిరెకంగా నినాదాలు చేశారు. దశాబ్ధాల చరిత్ర ఉన్న వర్రకుంటను లేకుండా చేసే కుట్ర చేస్తున్న గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు పై ఆగ్రహం చేస్తూనే విల్లాల నిర్మాణాలను వెంటనే ఆపాలని, వర్రకుంట గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు అంతర్భాగంలోనే వస్తున్నందున వర్రకుంట ఉన్న స్థలాన్ని వెంటనే జీయో ట్యాగింగ్ ద్వారా ఎఫ్‌టీఎల్ పాయింట్లను గుర్తించి వాటికనుగుణంగా ఫెన్సింగ్ వేసి ఎఫ్‌టీఎల్, బఫర్‌లను కాపాడాలని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వర్రకుంటను కాపాడుకునే క్రమంలో ఎంతవరకైనా పోరాటం చేస్తామని అవసరమైతే ఆర్డీవో, ఇరిగేషన్, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇంత దారుణమా? వర్రకుంట ఉనికే లేకుండా చేశారు.. వరప్రసాద్ రెడ్డి, ఉమ్మడి జిల్లా కార్మిక విభాగం నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ
పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొల్లారం ఇండస్ట్రీయల్ పరిధిలో ఉన్న వర్రకుంటను గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు మొత్తానికి మొత్తమే లేకుండా చేయడం దారుణం. వర్రకుంటను మా చిన్ననాటి నుండి చూస్తూనే పెరిగాం. వర్రకుంటలోనే ఈదాం. ఆటలాడాం.. వర్రకుంట కొన్ని వేల సంఖ్యల పశువుల దాహార్తిని తీర్చింది. ఇలాంటి కుంటను గ్రేటర్ ఇన్‌ఫ్రా బరితెగించి ఆక్రమిస్తే అధికారులు కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వర్రకుంట పై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ సంయుక్తంగా సర్వేచేసి 2-37 గుంటల ఎఫ్‌టీఎల్ ఉందని నిర్ధారించింది. లాంగ్ ట్యూడ్, లాటిట్యూడ్ పాయింట్లతో ఎఫ్‌టీఎల్ మ్యాప్, కెడాస్ట్రాల్ మ్యాప్‌లను హెచ్‌ఎండీఏ తన సైట్‌లో పొందుపర్చింది. గ్రేటర్ ఇన్‌ఫ్రా నిర్మిస్తున్న విల్లాల అంతర్భాగంలోనే వర్రకుంట ఉందని ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గ్రేటర్ ఇన్‌ఫ్రా పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. విల్లాల నిర్మాణాలను ఆపాలని ఆదేశించినప్పటికీ గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు నిర్మాణాలను ఎందుకు ఆపడం లేదు. ఇందులో అధికారుల పాత్ర దాగి ఉందన్న అనుమానం కలుగుతుంది. వెంటనే జిల్లా కలెక్టర్, మంత్రి హరీష్‌రావు స్పందించి వర్రకుంట పై పూర్తి స్థాయి విచారణ చేసి తిరిగి రిస్టోర్ చేసి వర్రకుంట ఉనికిని కాపాడాలి.
కుంటను ఆక్రమించి విల్లాలు నిర్మిస్తే పై నుండి వచ్చే వరద ఎక్కడికి పోవాలే.. హన్మంత్‌రెడ్డి, కౌన్సిలర్, బొల్లారం, బీఆర్‌ఎస్ పార్టీ
నిజాం కాలంలో నిర్మించిన లింక్ చెరువుల కారణంగా వర్షాలు వస్తే ఒక చెరువు లేదా కుంట నిండిన తర్వాత దాని కింది భాగంలో ఉన్న చెరువు లేదా కుంట నిండేలా అప్పట్లోనే వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టారు. ఇప్పుడున్న బిల్డర్ల ఆత్యాశ, కబ్జా చేయాలనే వాంఛ కారణంగా లింకు చెరువులు అన్యాక్రాంతమవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొల్లారంలోని వర్రకుంటను గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు చెరపట్టి కుంటనే లేకుండా చేస్తుంది. ఫలితంగా పై ప్రాంతం అంతే ఎగువన ఉన్న బాచుపల్లిలోని ఎల్లమ్మ చెరువు నుండి బొల్లారంలోని వర్రకుంటకు వరద నీరు వచ్చి ఇది నిండిన తర్వాత రేళ్లకుంటకు చేరుతుంది. ఇదంతా ఓ క్రమపద్దతిలో జరిగే చర్య. కాని అధికారులు ఈ విషయంలో మాత్రం నివేధికలు అంటూ తాత్సారం చేస్తున్నారు. గతంలోనే పనులు ఆపాలని గ్రేటర్ ఇన్‌ఫ్రాకు అధికారులు ఆదేశాలిచ్చినప్పికటీ గ్రేటర్ ఇన్‌ఫ్రా మాత్రం నిర్మాణ పనులు ఆపడం లేదు. దీన్ని బట్టి చూస్తే గ్రేటర్ ఇన్‌ఫ్రాకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు స్పష్టమవుతుంది. గ్రేటర్ ఇన్‌ఫ్రా చర్యలు తీసుకోని పక్షంలో నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని హెచ్‌ఎండీఏకు బొల్లారం మున్సిపాల్టిdలో కౌన్సిల్ తీర్మాణం చేసి పంపుతాం.
ఇప్పటికే అందరికి ఫిర్యాదు చేశాం. అయినా చర్యలు శూన్యం: రవిందర్‌రెడ్డి, బీజేపీ పార్టీ, బొల్లారం
వర్రకుంట కబ్జా పై బీజేపీ పార్టీ తరుపున ఇప్పటికే తహశిల్ధార్, ఇరిగేషన్ ఏఈ, డీఈఈ, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కు లిఖిత పూర్వక ఫిర్యాదుచేశాం. అయినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు వెనుకాల అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే హస్తం, స్వయంగా ఓ కార్పొరేటర్ ఇందులోనే ఉండటంతో జిల్లా అధికారయంత్రాంగం చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే వర్రకుంట నామరూపం లేకుండా పోయింది. ఇకనైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకుని వర్రకుంటను తిరిగి పునరుద్దరించాలి. లేకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయిస్తాం.
కుంటనే లేకుండా చేయాలనుకోవడం విడ్డూరం: ఆనంద్ క్రిష్టారెడ్డి, కేజీఆర్ ఫౌండేషన్ చైర్మన్, బొల్లారం గజమో లేక గుంటనో కబ్జా అయ్యందంటే పొరపాటో తప్పిదమో అనుకోవచ్చు. ఓ కుంటకు కుంటనే లేకుండా చేయాలన్నదాన్ని కుట్ర లేదా కబ్జా అని చెప్పొచ్చు. బొల్లారంలోని ఇండ్రస్ట్రీయల్ ఏరియాలో ఉన్న వర్రకుంటను గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కుట్రపన్ని దానిని లేకుండా చేసింది. అందులోనే విల్లాలను నిర్మిస్తుంది. అధికారులు పనులు ఆపాలని ఆదేశించినా ఇప్పటి వరకు గ్రేటర్ ఇన్‌ఫ్రా స్పందించడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇందులో తప్పకుండా అధికారపార్టీ నేతలు భాగస్వాములయ్యారని స్పష్టమవుతుంది. ఫలితంగానే అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. పూర్తిగా విల్లాల నిర్మాణం జరగకముందే అధికారులు స్పందించి ఎఫ్‌టీఎల్ పాయింట్ల ద్వారా వర్రకుంటను గుర్తించి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి వర్రకుంటను కాపాడాలి.
వర్రకుంటను కబ్జాకోరుల నుండి కాపాడాలి. సాయి కిరణ్‌రెడ్డి, కౌన్సిలర్, బీజేపీ పార్టీ, బొల్లారం
లింకు చెరువుల నిర్మాణంలో భాగంగా వర్రకుంట బొల్లారంలో నిర్మితమైందని పూర్వికుల ద్వారా సమాచారం. అయితే బొల్లారంలోని వర్రకుంటను ప్రస్తుతం గ్రేటర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు అనే నిర్మాణ సంస్థ కబ్జా చేసి అందులోనే విల్లాలను నిర్మిస్తుంది. ఇలా వర్రకుంట లేకుండా చేస్తే గ్రౌండ్ వాటర్ ఎలా పెరుగుతాయి. పైన ఉన్న బాచుపల్లిలోని ఎల్లమ్మ చెరువు నుండి వచ్చే వరద నీరు ఎక్కడికి పోతుంది. విజ్ఞులైన కలెక్టర్, ఇరిగేషన్ ఎస్‌ఈలు స్పందించి వర్రకుంటను కాపాడాలని కోరుతున్నాం. అధికారులు స్పందించకుంటే బీజేపీ జిల్లా పార్టీ సహకారంతో ఆందోళన చేపట్టమే కాకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.