Wednesday, December 18, 2024

TG | దశలవారీగా స్కాలర్ షిప్ లు చెల్లిస్తాం.. డిప్యూటీ సీఎం భ‌ట్టి

వికారాబాద్, డిసెంబర్ 17 ( ఆంధ్రప్రభ) : విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు బకాయిలను 20వ తేదీ నుండి దశలవారీగా చెల్లిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భ‌ట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఆయన చాంబర్ లో రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ బి.ఎడ్ కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులతో స్కాలర్ షిప్, ఫీజు బకాయిల విషయమై చర్చించేందుకు ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు గౌరి సతీష్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కే.శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పార్థసారథి, మల్లేశం, మధుసూదనరెడ్డి, శ్రీనివాస్ చౌదరి, జహీర్ లతో కూడిన 8మంది సభ్యుల బృందం పాల్గొని గత మూడు సంవత్సరాల నుండి స్కాలర్ షిప్, ఫీజు బకాయిలు రాక కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, సిబ్బందికి జీతాలు చెల్లించలేక, భవనాలకు అద్దెలు కట్టలేక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర మనో వేదనకు గురవుతున్నామని తెలిపారు.

ఆర్థిక సమస్యలు తట్టుకోలేక కొందరు యాజమాన్య సభ్యులు కళాశాలలు మూసివేశారని, మరికొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నా రని తెలిపారు. ఈ విషయాలను విని సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో మూడు సంవత్సరాలుగా ఉన్న బకాయిలను ఒకే సారి చెల్లించే ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం లేదని, దశల వారిగా చెల్లించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, కళాశాలల యాజమాన్యాలను ఆదుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీరు మాకు సహకరించాలని, మీకు మేము సహకరిస్తామన్నారు.

- Advertisement -

ఈనెల 2వ తేదీ నుండి మొదలు పెట్టి, వీలైనన్ని బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని తెలిపారు. మిగితా బకాయిలను వచ్చే సంవత్సరం చెల్లిస్తామన్నారు. ఈ సమావేశంలో జూనియర్, డిగ్రీ బి.ఎడ్ కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి చైర్మన్, రాష్ట్ర విద్యా శాఖా ముఖ్య కార్యదర్శి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం టి పి జె ఎం ఏ తరపున అధ్యక్షులు గౌరి సతీష్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement