Friday, November 22, 2024

ఈ-బైక్‌ ప్రమాదాలపై దర్యాప్తు చేస్తాం.. ఊహకు మించి ఈవీ రంగ అభివృద్ధి

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఎలక్ట్రిక్‌ వాహనాలు మంటల్లో చిక్కుకుపోవడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. మంటల్లో చిక్కుకున్న ప్రతీ ఘటనపై దర్యాప్తు చేస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి గిరిధర్‌ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ వాహనాలు మంటల్లో చిక్కుకుని పలువురు మృతి చెందారన్నారు. ఎలక్ట్రిక్‌ వాహన రంగం ఊహకు మించి అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ రూ.21,000 కోట్ల ఆస్తుల నగదీకరణ లక్ష్యాన్ని చేరుకుందని ప్రకటించారు. మరోవైపు ఆస్తుల నగదీకరణలో భాగంగా 2021-22లో రూ.15,000 కోట్లు సమీకరించామని తెలిపారు. మరో రూ.5వేల కోట్లు టోల్‌ సెక్యూరిటైజేషన్‌ ద్వారా.. మొత్తంగా రూ.21వేల కోట్లు సమీకరించినట్టు వివరించారు. విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీ, డిజైన్‌, నిర్వహణ, సేకరణ ఇలా ప్రతీ దశను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

నివేదిక తరువాతే చర్యలు..

మంటల ఘటనపై ఇప్పటికే ఓ నిపుణల కమిటీని ఏర్పాటు చేశామని గిరిధర్‌ చెప్పుకొచ్చారు. ఇంకా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉందన్నారు. ఈవీల తయారీ సంస్థలు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఫలితంగా ఈ రంగంలో ముందు ఉండాలన్న భారత్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఈ కల చెదిరిపోలేదన్నారు. నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన తరువాతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భద్రతా విషయంలో కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఊరుకునేది లేదన్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక పంపాలని సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సేఫ్టీ ఇటీవల కేంద్రం ఆదేశించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా పలు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మూడు ప్యూర్‌ విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు, ఒక ఓలా, రెండు ఒకినవ, 20 జితేంద్ర విద్యుత్‌ స్కూటర్లు మంటల్లో చిక్కుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement