Tuesday, November 26, 2024

రాజకీయ రిజర్వేషన్ల ప్రయత్నాలు పెంచుతాం.. బీసీ రాజ్యాధికార సమితి వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్టసభల్లో బీసీలకు తొలి విడతగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని,  అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలని బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు విపక్ష నాయకులను సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ నేతృత్వంలోని బృందం సోమవారం ఢిల్లీలో కలిసి చట్ట సవరణకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఈ అంశంపై పార్టీ పార్లమెంటరీ కమిటీలో చర్చిస్తానని లక్ష్మణ్ అన్నారని సురేష్ తెలిపారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి దేశంలో బీసీల పట్ల అసమానత, అంటరానితనం కొనసాగుతున్నాయని వివరించారు.

బీసీలకు చట్టసభల్లో తొలి విడుతగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో రాజ్యాంగ సవరణలు చేసేలా సహకరించాలని ఆయనను కోరారు. పార్లమెంట్‌లోనూ రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీ, జేడీయుతో పాటు ఇతర పార్టీ నేతలను బీసీ రాజ్యాధికార సమితి ప్రతినిధులు కలిసి వెనుకబడిన వర్గాల డిమాండ్లు, సమస్యలను వివరించారు. తెలంగాణలో త్వరలో బీసీ రాజ్యాధికార సమితి నిర్వహించబోయే భారీ భహిరంగ సభకు రావాల్సిందిగా వారందరినీ ఆహ్వానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement