కుప్పం, జులై 25(ప్రభ న్యూస్): వైసీపీ పాలనతో రాష్ట్రం అప్పుల్లో మునిగి పోయిందని, ప్రజలంతా ఓపికతో చంద్రబాబుకు కొంత సమయమిస్తే మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అందిస్తారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు.
ఆమె కుప్పం నియోజకవర్గంలో మూడవ రోజు పర్యటనలో భాగంగా మాట్లాడుతూ… 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ కుటుంబాల కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించారని, అందుకే ప్రజా ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. మీ ఓట్లతో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని 2014 పాలన చూసిన మీరు, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనను కూడా చూశారన్నారు. అందుకే 2024లో మీకు ఏ ప్రభుత్వం అవసరమో ఓట్లతో తీర్పునిచ్చారని ఆమె తెలిపారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చూశారని నేడు ఆ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పౌరులు అనుభవిస్తున్నారని ఆమె తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు లోటు బడ్జెట్లో రాష్ట్ర పగ్గాలు చేపట్టారు కానీ, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు నడపిం చేందుకు ప్రయత్నించారని నారా భువనేశ్వరి తెలిపారు. 2019లో అధికారంలోకి రాకపోవడం వల్ల వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, నేడు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తెలిపారు. గతంలో కార్యకర్తల కోసం లోకేష్ అనేక కార్యక్రమాలు చేశారని, రానున్న కాలంలో మరిన్ని చేసి మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత తమ కుటుంబంపై ఉందన్నారు. తమ కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నారా భువనేశ్వరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఇంచార్జి మునిరత్నం, తదితరులు పాల్గొన్నారు.