వాజేడు : వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు. ఈరోజు మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో పర్యటించారు. ముందుగా పూసూర్ బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. అనంతరం వాజేడు మండల కేంద్రం చేరుకొని బీసీ వాడలోని గోదావరి ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వరద బాధిత కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన ముంపునకు గురైన 30 కుటుంబాలకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని.. అండగా ఉంటుందన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో మంత్రి దయాకర్ రావు పర్యటించిన నేపథ్యంలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టి మంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతం చేశారు. మంత్రి పర్యటనలో ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య, పీవో అంకిత్, ఆర్డీవో రమాదేవి, ఏఎస్పి అశోక్ కుమార్, వాజేడు తాసిల్దార్, గూడూరు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.