Wednesday, November 20, 2024

వలీవుల్లా మరణశిక్షపై హైకోర్టుకు వెళ్తాం.. చాలా కేసుల్లో పై కోర్టుల్లో ఊరట లభించిందన్న జమియత్​ నేత

వారణాసిలో 2006లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో వలీవుల్లాకు మరణశిక్ష విధించడాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు జమియత్ ఉలమా-ఏ-హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా అసద్ మదానీ మంగళవారం తెలిపారు. సోమవారం ఘజియాబాద్ కోర్టు పేలుళ్ల కేసులో ఏకైక నిందితుడు వలీవుల్లాకు మరణశిక్ష విధించింది. శనివారం ఈ కేసులో దోషిగా తేలింది.గత పదేళ్లుగా, వలీవుల్లాకు ముస్లిం సంస్థ జమియత్ ఉలమా-ఎ-హింద్ న్యాయ సహాయం అందిస్తోంది.హైకోర్టులో ఆయనకు పూర్తి న్యాయం జరుగుతుందని తమకు పూర్తి నమ్మకం ఉంది. దిగువ కోర్టులు కొన్ని శిక్షలు విధించిన కేసులు చాలా ఉన్నాయి. అయితే ఆ కేసులు హైకోర్టుకు వెళ్లినప్పుడు, న్యాయం జరిగింది  అని మౌలానా అసద్ మదానీ అన్నారు.

దీనికి ఉదాహరణ అక్షరధామ్ ఆలయంపై దాడి కేసుగా అతను చెప్పుకొచ్చాడు.  దీనిలో దిగువ కోర్టు ముగ్గురికి మరణశిక్ష మరియు నలుగురికి జీవిత ఖైదు విధించిందని, కాగా, హైకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించినా.. సుప్రీంకోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పోలీసులను మందలించినట్టు మౌలానా అసద్​ చెప్పారు. ఈ కేసులో కూడా జమియత్ ఉలమా-ఎ-హింద్ న్యాయ సహాయం అందించింది.

2006 వారణాసి సీరియల్ బ్లాస్ట్‌లు..

అది 2006.. మార్చి 7వ తేదీ.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయం, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన పేలుళ్లలో దాదాపు20 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు. అదే రోజు సాయంత్రం దశాశ్వమేధ ఘాట్ వద్ద పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయి. మరుసటి నెల వారణాసి పోలీసులు ఈ కేసుకు సంబంధించి వలీవుల్లాను అరెస్టు చేశారు. వారణాసిలో వరుస పేలుళ్లకు ఆయన కుట్ర పన్నారని ఆరోపించారు. వారణాసిలోని న్యాయవాదులు అతని కేసులో పోటీ చేయడానికి నిరాకరించడంతో అలహాబాద్ హైకోర్టు దానిని ఘజియాబాద్‌లోని కోర్టుకు బదిలీ చేసింది. హత్య, హత్యాయత్నం వంటి ఐపీసీ సెక్షన్ల కింద పేలుడు పదార్థాల చట్టం కింద నమోదైన రెండు కేసుల్లో మొన్న కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement