ప్రధాని మోదీ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి పేరిట హిందూ పౌరస్మృతి తేవడానికి ప్రయత్నిస్తున్నారని, ఒకవేళ చట్టం తెస్తే కోర్టుకు వెళతామని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు. భోపాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్, పాస్మాండ(నిరుపేద) ముస్లింలపై ప్రధాని ప్రసంగించడంపై ఆయన మండిపడ్డారు. ఈమేరకు హైదరాబాద్‌లో విలేకరులతో ఒవైసీ మాట్లాడుతూ… ”దేశ బహుళత్వానికి, భిన్నత్వంలో ఏకత్వానికి కీడు చేయడమే మోదీ పని. లోక్‌సభలో బలముందని చట్టం తెస్తే మేం న్యాయస్థానం తలుపు తడతాం” అని హెచ్చరించారు.
అలాగే ”పాకిస్థాన్‌లో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారని మోదీ అంటున్నారు. పాకిస్థాన్ నుంచి మీరెందుకు స్ఫూర్తి పొందుతున్నారు? ఇప్పటికే ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చేసిన చట్టంతో మన దేశంలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా మహిళలపై దోపిడీ మరింత పెరిగింది.
ఒకవైపు నిరుపేద ముస్లింల కోసం మొసలి కన్నీరు కారుస్తూనే… మరోవైపు మీ పార్టీ కార్యకర్తలు మసీదులపై దాడులు చేస్తున్నారు. వారి జీవనోపాధిని నాశనం చేస్తున్నారు. వారిళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. నిరుపేద ముస్లింల ఓట్లడిగే ముందు… మీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి క్షమాపణలు చెప్పాలి” అని ఒవైసీ ట్వీట్ చేశారు.