Monday, November 25, 2024

Delhi | సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడతాం.. అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు కేకే, నామా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడతామని బీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన  ఆదివారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల ఉభయసభల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉభయ సభల్లో తమ గళం వినిపిస్తామన్నారు. తొలి రెండ్రోజుల అజెండా ఇచ్చారని, మిగతా మూడు రోజులు ఏముంటుందో చెప్పలేదన్నారు. మిగతా మూడు రోజుల్లో ఏదైనా సర్‌ప్రైజ్ ఉంటుందేమో చూడాలని చెప్పారు.

ఓబీసీలు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారని వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన మిగతా అంశాల మీదా కేంద్రాన్ని నిలదీస్తామని నామ చెప్పారు. అంతకుముందు కొత్త పార్లమెంట్ భవనం వద్ద లోక్‌సభ స్పీకర్ ఓంబిర్ల, ఉపరాష్ట్ర జగదీప్ ధన్కడ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణలో బీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొన్నారు.

- Advertisement -

జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రజలకు, ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులకు ఎంపీ నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారత దేశంలో అంతర్భాగమైందని గుర్తు చేశారు. జాతీయ దినోత్సవం వేళ బంగారు తెలంగాణా సాధనకు సమైక్యంగా కృషి చేద్దామని , తెలంగాణా ప్రగతిని ఇలానే కొనసాగిద్దామని నామ పిలుపునిచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement