Friday, November 22, 2024

Telangana | రిమోట్​ ఓటింగ్​ సిస్టమ్​పై చర్చిస్తాం.. ఈసీకి లిఖిత పూర్వక అభిప్రాయం తెలుపుతాం: బీఆర్​ఎస్​

కేంద్రం తీసుకురావాలనుకుంటున్న రిమోట్​ ఓటింగ్​ విధానాన్ని బీఆర్​ఎస్​ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ కుమార్​. ఆ విధానం దేశంలో అవసరం లేదని తాము భావిస్తున్నామని, దీనికి సంబంధించి పార్టీలో చర్చించి ఈనెల 30 లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు లిఖిత పూర్వకంగా బీఆర్​ఎస్​ పార్టీ అభిప్రాయం తెలుపుతాం అన్నారు. ఢిల్లీలో ఇవ్వాల (సోమవారం) మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఎన్నిక‌ల్లో వాడుతున్న ఈవీఎంల‌ను హ్యాక్ చేస్తున్నార‌నే అనుమానాలున్నాయని.. ఆ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బ‌లంగా నమ్ముతున్నారన్నారు. అయితే.. అట్లాంటి ప్రచారాలపై ఈసీ ఇప్పటి వ‌ర‌కు నివృత్తి చేయ‌లేదని, అట్లాంటప్పుడు మ‌ల్టీ కానిస్టిట్యూయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసింగలమని ప్రశ్నించారు.

ఇక.. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాలే ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌ను ప‌క్కన‌ పెట్టేశాయని, మరి భారత్​లో ఎట్లా ఈ విధానం అమలు చేయగలరన్నారు బోయినపల్లి వినోద్ కుమార్​. అంతేకాకుండా నిత్యం బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేస్తున్న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయని,  అట్లాంటప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో వేసే ఓట్లను ఎలా న‌మ్మగ‌లం అని ప్రశ్నించారు. అక్కడి నుంచి ఆ ఓట‌రే ఓటు వేస్తున్నాడా? హ్యాక్ చేస్తున్నారా? అనేది ఎట్లా తెలుసుకోగలం.. అందుకని తాము రిమోట్​ ఓటింగ్​ సిస్టమ్​కి వ్యతిరేకమని స్పష్టంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement