ఈ ఏడాది కూడా పెట్టుబడి వ్యయాలను కొనసాగిస్తామని వేదాంత లిమిటెడ్ స్పష్టం చేసింది. జింక్, ఆయిల్ అండ్ గ్యాస్, అల్యూమినియం వ్యాపారాల్లో భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. 2022-23లో 2 బిnలియన్ డాలర్లు (దాదాపు రూ.16 వేల కోట్లు) వెచ్చించనున్నట్లు వేదాంత తెలిపింది. జింక్, చమురు-గ్యాస్, అల్యూమినియం వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడతామని వెల్లడించింది. ప్రాజెక్టులను మధ్యలో నిలిపివేసే ప్రసక్తే లేదని సంస్థ సీఈవో సునీల్ దుగ్గల్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో దీర్ఘకాలంలో పటిష్ట రిటర్నులు లభిస్తాయని అన్నారు. తద్వారా నిర్వహణ సామర్థ్యం పెరగడంతోపాటు, ఉత్పాదకత పుంజుకుంటుందని చెప్పారు.
దేశీయ మినరల్స్ అండ్ మెటల్స్ పరిశ్రమపై ఎన్‌ఎండీసీ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సు రెండవ రోజు దుగ్గల్ విలేకరులతో మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో సుమారు 3 బిలియన్ డాలర్ల మూలధనాన్ని వెచ్చించనున్నట్లు స్పష్టంచేశారు. ప్రస్త్తుతం ఉన్న 18 బిలియన్ డాలర్ల నుంచి ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల కంపెనీగా మారాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు.