Friday, November 22, 2024

ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటాం : విజయ సాయిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటామని వైఎస్సార్సీపీ సభ్యులు విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఉమ్మడిగా విఫలమయ్యాయని అన్నారు. 2014లో లోక్‌సభలో తలుపులు మూసేసి విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారని, ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు హోదా  పదేళ్ళు ఇవ్వాలని పట్టుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి స్వయంగా ఇదే సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన హామీ నేటికీ ఆచరణకు నోచుకోలేదని విజయసాయి ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో ప్రధాని అంతటి వ్యక్తి ఇచ్చిన హామీని సైతం అమలు చేయకుండా తుంగలో తొక్కడానికి బీజేపీ ప్రభుత్వం వెనకాడటం లేదని  విమర్శించారు. విభజన పేరిట ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని వాపోయారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సవాళ్ళకు మూల కారణం కాంగ్రెస్‌, బీజేపీలేనని ఆయన ధ్వజమెత్తారు. 2014లో విభజన బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందే నాటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత అధికారం కోల్పోయింది. కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటోంది. పార్టీలు, ప్రభుత్వాలు మారినా ఇచ్చిన హామీ నేరవేర్చే బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు. హామీ అమలు అయ్యేలా చూడాల్సిన అస్యూరెన్స్‌ కమిటీ సైతం చేతులు ముడుచుకుని చోద్యం చూస్తోందని  విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసినందుకే కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్ర ప్రజలకు ముఖం కూడా చూపించలేనంత దుస్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను చట్టబద్దం చేస్తూ అవి అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత  తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని, హోదా ఇచ్చే వరకు విశ్రమించేది లేదు, విస్మరించేది లేదని నొక్కి చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కు అని అన్నారు.

మూడు రాజధానుల ప్రణాళిక..

వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్నంగా తీసుకువచ్చిన మూడు రాజధానుల ప్రణాళిక సర్వదా జనామోదం పొందిందని విజయసాయి రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం కారణంగా వికేంద్రీకరణ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందలేదని చెప్పారు మూడు రాజధానుల ప్రణాళికకు చట్టబద్ధత ఏ విధంగా ఉందో ఆయన వివరించారు. మొదటగా పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రాజ్యంగంలోని ఆర్టికల్‌ 154 (రెడ్‌ విత్‌ ఆర్టికల్‌ 163) స్పష్టం చేస్తోందన్నారు. రాజధాని ఏ నగరంలో ఉండాలన్నది నిర్ణయించేంది పాలనాధికారం మాత్రమేనని  తెలిపారు. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను అనుసరించి ఆర్టికల్‌ 38 ప్రకారం ప్రాంతీయ అసమానతలను తొలగించాలని, మూడు రాజధానుల ద్వారా పాలనను వికేంద్రీకరించే చర్య ఆ దిశగా తీసుకున్న నిర్ణయమేనని స్పష్టం చేశారు. లోక్‌సభలో 2020 ఫిబ్రవరి 4న హోం శాఖ మంత్రి ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ప్రకారం ఒక రాష్ట్ర పరిధిలో రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ మూడు రాజధానుల ప్రణాళికకు కేంద్రం కూడా ఆమోదం తెలిపిందని శ్రీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.

విశాఖకు మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కేటాయించాలి..

రాష్ట్రపతి ప్రసంగంలో దేశంలో మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావిస్తూ 41 లక్షల జనాభా కలిగిన విశాఖపట్నంలో 76 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్‌ పాలసీ 2017కి అనుగుణంగా డీపీఆర్‌ చేయించి పంపించినా ఇప్పటి వరకు దానికి ఆమోదం తెలపలేదని అన్నారు. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కావాలి..

 దేశ జనాభాలో 50 శాతం పైబడే ఉన్నప్పటికీ 27 శాతం రిజర్వేషన్లకే బీసీలు పరిమితమయ్యారని, బీసీలకు వారి జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీల జనాభాకు సంబంధించి సరైన సమాచారం అందుబాటులో లేనందుకున వారి జనాభాకు తగినట్లుగా సంక్షేమ పథకాలు అందడం లేదని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో  బీసీలకు స్థానికి సంస్థలలో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల మాదరిగా చట్ట సభల్లో కూడా బీసీలకు వారి జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని విజయ సాయి నొక్కి చెప్పారు.

మహిళలకు లేని భద్రత..

రాష్ట్రపతి ప్రసంగంలో పలుమార్లు మహిళల గురించి ప్రస్తావించినా మహిళల భద్రత గురించి ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. జాతీయ మహిళా కమిషన్‌కు అందుతున్న ఫిర్యాదుల ప్రకారం గడచిన 8 ఏళ్ళలో మహిళలపై జరిగిన నేరాలు 31 వేలకు పైనే ఉన్నట్లు తెలిపారు. ఒక్క 2021లోనే దేశవ్యాప్తంగా మహిళలపై 4 లక్షల నేరాలు జరిగాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నా వారి భద్రత కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాపోయారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించడంలో న్యాయ వ్యవస్థ కూడా విఫలమవుతోంది. పెండింగ్‌ కేసుల సంఖ్య 95 శాతానికి చేరిందని, మహిళలపై జరిగే నేరాల్లో శిక్షలు పడిన కేసులు కేవలం 26 శాతం మాత్రమే ఉన్నాయని అన్నారు. న్యాయ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం..

దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని ఎంపీ అన్నారు. జనాభాలో ఏటా కోటి మంది పని చేసే వయసుకు చేరుకుంటున్నా, శ్రామిక రంగంలో ఉపాధి పొందుతూ ఆర్థిక రంగానికి తోడ్పాటు ఇస్తోంది కేవలం 42 శాతం మాత్రమేనని ఎంపీ వెల్లడించారు. అమృత కాలం కేవలం కేంద్రానికే పరిమితం చేయకుండా రాష్ట్రాలకు కూడా పంచేలా చూడాల్సిన అవసరం ఉందని విజయ సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement