Tuesday, November 26, 2024

మునుగోడులో పోటీ చేస్తాం.. టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు పాతరేస్తారు : ప్రవీణ్‌కుమార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సామాజిక న్యాయం అంజెండాగా మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో బీఎస్పీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించాలని మాయావతి దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారన్నారు. తిన్నది అరగక బలిసి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్న మునుగోడు అగ్రవర్ణాల చేతిలో చిక్కుకుపోయిందని వాపోయారు. ఉపఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్తారని జోస్యం చెప్పారు. మునుగోడులోనే కాక ఎక్కడ ఎన్నికలు వచ్చినా పోటీ చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ అగ్ర వర్ణాల చేతిలో బందీగా ఉందన్న ప్రవీణ్ కుమార్, రాష్ట్రంలో రాజ్యాధికారం తీసుకురావాలని మాయావతి సూచించారని తెలిపారు.

తెలంగాణలో బీఎస్పీ గెలవడం చారిత్రక అవసరమని అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ప్రజలను ప్రలోభ పెట్టడాన్ని ఖండిస్తున్నానన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్య పట్ల మొదట స్పందించింది తమ పార్టీయేనని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యార్థులంటే కోపమని ఆయన ఆరోపించారు. విద్యార్థులు తమకు మంచి విద్య, ప్రొఫెసర్లు, సదుపాయాలు అడుగుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు పాతర పెడతారని ప్రవీణ్‌కుమార్ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement