Sunday, November 10, 2024

TG | 15 రోజుల్లోగా నియామ‌కాలు పూర్తి చేస్తాం…

ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు త‌మ‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని 2008 డీఎస్సీ బాధితులు సోమ‌వారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి త‌ర‌లివ‌చ్చారు. డీఎస్సీ-2008 సాధ‌న స‌మితి నేతృత్వంలో రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 200 మందికిపైగా అభ్య‌ర్థులు సీఎం ఇంటివ‌ద్ద‌కు వ‌చ్చారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఆరుగురిని సీఎం నివాసంలోకి పంపించారు. సీఎం వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి జైపాల్ రెడ్డి వారితో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా బాధితులు మాట్లాడుతూ… డీఎస్సీ 2008 బాధితుల‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని హైకోర్టు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు జారీ చేసింద‌న్నారు.

ఈ మేర‌కు ఈ ఏడాది మార్చి 14వ తేదీన జ‌రిగిన రాష్ట్ర క్యాబినెట్ స‌మావేశంలో డీఎస్సీ 2008 బాధితుల‌కు ఏపీ త‌ర‌హాలో ఉద్యోగాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ద‌న్నారు. విధివిధానాల ఖ‌రారు బాధ్య‌త‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ నేతృత్వంలోని క్యాబినెట్ స‌బ్ క‌మిటీకి అప్ప‌గించింద‌ని చెప్పారు. ఇప్ప‌టికి ఆరు నెల‌లు గ‌డుస్తున్నా ఇంకా త‌మ‌కు ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌న్నారు. ఈ నెల 27వ తేదీనాటికి (మంగ‌ళ‌వారం) నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని, చివ‌రి అవ‌కాశం ఇవ్వాలని తెలంగాణ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ హైకోర్టు ధ‌ర్మాస‌నానికి తెలిపార‌న్నారు. ఈ గ‌డువు మంగ‌ళ‌వారంతో ముగ‌స్తున్న‌ద‌ని చెప్పారు. 15 సంవ‌త్స‌రాల త‌మ ఎదురుచూపుల‌కు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం తెర‌దించింద‌ని త‌మ‌కు ఉద్యోగాలు కూడా ఇచ్చి ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

బాధితుల నుంచి వివ‌రాలు సేక‌రించిన అనంత‌రం ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు విద్యాశాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశంతో మాట్లాడి వివ‌రాల‌ను సేక‌రించారు. సంబంధిత ఇత‌ర అధికారుల‌తోనూ చ‌ర్చ‌లు జ‌రిపారు. రాబోయే వారం రోజుల్లో క్యాబినెట్ స‌బ్ క‌మిటీ నుంచి నివేదిక తీసుకొని, 15 రోజుల్లో డీఎస్సీ 2008 బాధితుల నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని సీఎం కార్యాల‌య అధికారులు హామీ ఇచ్చిన‌ట్టు డీఎస్సీ -2008 సాధ‌న స‌మితి రాష్ట్ర అధ్యక్షుడు సభావాట్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో సాధ‌న స‌మితి ఉపాదక్షుడు భాస్కర్, ప్ర‌తినిధులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ చావ్లా, ప్రమీల, ప్రశాంతి, లావుడ్య‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement