Friday, November 22, 2024

Delhi | తెలంగాణ విద్యుత్ బకాయిలను వసూలు చేస్తాం.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వాటా కింద విడుదల చేసే కేంద్ర పన్నుల నుంచి మినహాయించి తమకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర విద్యుత్‌, ఆర్థిక శాఖలు పరిగణనలోకి తీసుకున్నాయా? తీసుకుంటే ఈ బకాయిల చెల్లింపు ఎప్పటిలోగా జరుగుతుందని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయనను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్ ఆయన ప్రశ్నలకు జవాబిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్ళాయని, ఫలితంగా కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొందని చెప్పారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయవలసిందిగా ఏపీని ఆదేశించిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ సరఫరా చేసిన విద్యుత్‌ నిమిత్తం కొంతకాలం సక్రమంగానే ఛార్జిలను చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం తదనంతరం చెల్లింపులను నిలిపివేయగా, తెలంగాణ చెల్లించవలసిన విద్యుత్‌ ఛార్జిల బకాయిలు 6 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయి. బకాయిల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల అధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. కేంద్రం ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సరఫరా చేసినందున తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని మంత్రి చెప్పారు. ఒక రాష్ట్రం బకాయిలు చెల్లించకుండా మొండికేసిన సందర్భంలో బకాయిల చెల్లింపు కోసం కేంద్రం అనుసరించాల్సిన విధివిధానాలపై న్యాయ మంత్రిత్వ శాఖతోను, ఆర్థిక మంత్రిత్వ శాఖతోను చర్చలు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర పన్నులలో వాటా కింద తెలంగాణకు ఇచ్చే నిధుల నుంచి ఈ బకాయిల మొత్తాన్ని మినహాయించ వలసిందిగా రిజర్వు బ్యాంక్‌ను కోరే ప్రయత్నం చేస్తున్నామని ఆర్‌.కె సింగ్‌ వివరించారు.

- Advertisement -

కోపరేటివ్ సొసైటీల్లో అవినీతికి చెక్ 

అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకుపోతూ అనేక కోపరేటివ్ సొసైటీలు ఖాయిలా పడుతున్నాయని, వీటిని అరికట్టేందుకు చట్టపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే సహకార స్ఫూర్తికే ముప్పు వాటిల్లుతుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీల సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఖాయిలా పడిన కోపరేటివ్ సొసైటీలకు పురుజ్జీవం కల్పించేదుకు కోపరేటివ్ పునరావాస, పునర్నిర్మాణ, అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. పునరావాసం, పునర్నిర్మాణం, అభివృద్ధికి నిజంగా అర్హులైన సొసైటీలను గుర్తించి వాటికి మాత్రమే ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించాలని ఆయన సూచించారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలే సహకార సంఘాలు ఖాయిలా పడటానికి ప్రధాన కారణాలంటూ విజయసాయి ఉదాహరణలు చెప్పారు. అలాగే కోపరేటివ్‌ సొసైటీల్లో ఎన్నికల నిర్వహణ కోసం ఈ బిల్లులో ప్రతిపాదించిన కోపరేటివ్‌ ఎలక్షన్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. కోపరేటివ్‌ ఎన్నికలలో ఇలాంటి అవాంఛనీయ రాజకీయ శక్తులు ప్రవేశించి తద్వారా సొసైటీలను అవినీతి, అక్రమాలమయం చేయకుండా  నిరోధించే బాధ్యతను ఈ ఎలక్షన్‌ అథారిటీకి అప్పగించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

వ్యవస్థ బలోపేతం ద్వారానే కేసుల పరిష్కారం

మధ్యవర్తిత్వం (మీడియేషన్‌) ద్వారా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కోటికి పైగా కేసులు పరిష్కరించాలంటే ఈ వ్యవస్థను వందరెట్లు బలోపేతం చేయాల్సి ఉంటుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం బిల్లు 2021 బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని వివిధ కోర్టుల్లో నాలుగున్నర కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో కోటికి పైగా సివిల్‌ కేసులేనని అన్నారు. దేశంలో 2022 నాటికి 570 మీడియేషన్‌ కేంద్రాలు, 16 వేల మంది మీడియేటర్లు ఉండడం వల్ల పెండింగ్‌లో ఉన్న కోటికిపైగా సివిల్‌ కేసులలో 90 వేల కేసులను మాత్రమే పరిష్కరించగల సామర్ధ్యం ప్రస్తుత మీడియేషన్‌ వ్యవస్థకు ఉందన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే తగినన్ని మీడియేషన్‌ సెంటర్లు, మీడియేటర్లు లేనందున ఆ వ్యవస్థపై మోయలేనంత భారం పడుతుంది. ఈ వ్యవస్థను వంద రేట్లకు పైగా బలోపేతం చేయకపోతే ఈ బిల్లు ప్రయోజనం నెరవేరదని ఆయన అన్నారు. సున్నితమైన రాజకీయ అంశాలు ఇమిడి ఉండే కేసుల పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్‌ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఎంపీ నొక్కి చెప్పారు.

జూన్‌లో 12 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్ళు

గతేడాది జూన్ నెల జీఎస్టీ వసూళ్ళతో పోల్చుకుంటే 2023 జూన్ నెలలో జీఎస్టీ వసూళ్ళు 12శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. జీఎస్టీ కింద 2023 జూన్ నెలలో రూ.161,497 కోట్లు వసూలైనట్లు మంత్రి తెలిపారు. ఒక్క నెలలో జీఎస్టీ మొత్తం వసూలు రూ.1.6 కోట్లు అదిగమించడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారని అన్నారు. జీఎస్టీ వసూళ్లలో ప్రతి సంవత్సరం సాధిస్తున్న వృద్ధితో అనుకూల ధోరణి కనిపిస్తోందని అన్నారు. పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి  జీఎస్టీ యాక్ట్ ప్రకారం జీఎస్టీ అమలు చేయడం ద్వారా మొదటి 5 సంవత్సరాలు 2017 జూన్ 1 నుండి 2022  జూన్ 30 వరకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పడ్డ రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్రం నష్టపరిహారం చెల్లించిందని అన్నారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రతి రెండు నెలలకోసారి లెక్కించి విడుదల చేయాలని అన్నారు.

అటల్ జ్యోతి కింద ఏపీలో 5,500 సోలార్ వీధి లైట్లు

అటల్ జ్యోతి యోజన పథకం ఫేజ్ 2 కింద ఆంధ్రప్రదేశ్‌లో యాస్పిరేషనల్ జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నంలలో 5500 సోలార్ వీధి లైట్లు అమర్చినట్లు కేంద్ర విద్యుత్ శక్తి శాఖ సహాయ మంత్రి ఆర్.కె సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. అటల్ జ్యోతి పథకం మొదటి ఫేజ్‌లో ఆమోదిత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదని అన్నారు. అనంతరం ఫేజ్‌2 లో ఏపీలోని మొత్తం మూడు యాస్పిరేషనల్ జిల్లాలు కూడా కవర్ చేయబడ్డాయని మంత్రి తెలిపారు. అయితే విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు మొత్తం 5500 సోలార్ వీధి లైట్లు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయగా ఆయా జిల్లాల్లో సోలార్‌ వీధిలైట్లు అమర్చినట్లు మంత్రి తెలిపారు.

అధికారుల అలసత్వమే హెచ్‌ఐవి డ్రగ్స్‌ కొరతకు దారితీసిందా?

హెచ్ఐవీ డ్రగ్స్ సేకరణ కోసం 2014, 2017, 2022 సంవత్సరాల్లో టెండర్‌ను ఖరారు చేసే విషయంలో అధికారుల అలసత్వం కారణంగా ప్రాణాధారమైన హెచ్‌ఐవి డ్రగ్స్‌కు తీవ్ర కొరత ఏర్పడిన వాస్తవం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందా…ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించాలంటూ మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement