కేంద్రంలో తమపార్టీ అధికారంలోకి రాగానే అగ్నివీర్ ప్రక్రియను రద్దుచేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అగ్నివీర్ కారణంగా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని ఆశగా ఎదురు ఎందరో యువకులు నిరుత్సాహానికి గురయ్యారన్నారు. ఇలాంటి యువతను దృష్టిలో ఉంచుకుని అగ్నివీర్‌ను పూర్తిగా రద్దుచేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో కొనసాగింది. ఉదయం 6.15 గంటలకు మావి కలన్ నుంచి జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు.
సిసానా సమీపంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన దేవీలాల్ చౌదరి సహా ఐదుగురు యువకులు రాహుల్‌తో దాదాపు 25 నిమిషాల పాటు సంభాషించారు. తాను అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో తాను ఎంపికయ్యానని, అయితే ఎలాంటి కారణం లేకుండా రిక్రూట్‌మెంట్‌ను నిలుపుదల చేశారని రాహుల్ గాంధీ దృష్టికి దేవీలాల్ తీసుకొచ్చాడు. దీనిపై రాహుల్ తీవ్రంగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దుచేస్తుందని.. పాత విధానంలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరుపుతామని యువకులకు హామీ ఇచ్చారు.
భారత్ జోడో యాత్రలో రాలోడ్, పీస్ పార్టీ, భీమ్ ఆర్మీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాగ్‌పట్ జిల్లాకు చెందిన దాదాపు 200 మంది భీమ్ ఆర్మీ కార్యకర్తలు రాహుల్ వెంట నడిచారు. షావ్లిలోని యూపీ సరిహద్దు వరకు నడవనున్నట్లు వారు తెలిపారు. యాత్ర బాగ్‌పట్ చేరుకోగానే ఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు రాహుల్‌గాంధీకి ఘనంగా స్వాగతం పలికారు. కాగా, మదీనాలోని మదర్సా ఒసాటియాకు చెందిన సదర్ హజ్రత్ మౌలానా ఒసామా కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మన దేశంలో జరుగుతున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్ తీసుకున్న చర్యకు మనమందరం చేయీచేయీ కలుపుదాం అని సదర్ హజ్రత్ మౌలానా ఒసామా చెప్పారు.