సంగారెడ్డి, (ప్రభ న్యూస్) : రైతుబంధు డాటాలో నమోదు లేని, పంట వివరాలు తప్పుగా నమోదైన రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రైతులు తమ భూమి దస్తావేజులు లేదా పత్రాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వాలని, గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ విచారణ చేసి వ్యవసాయ అధికారికి సిఫారసు చేయాలని సూచించారు. ఏఈఓ అట్టి టోకెన్‌ను రైతుకు జారీ చేయాలని, టోకెన్ ఫొటో తీసి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జీకి వాట్సప్ చేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జీ టోకెన్ క్రమంలో సంబంధిత రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత రైతులు తమ ఆధార్ కార్డుకు లింకు అయిన ఫోన్ నెంబరుకు వచ్చే ఓటిపి నెంబర్‌ను కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జీకి తెలపాలన్నారు. పీసీసీ ఇంచార్జీ ఓటిపి నమోదు చేసి ధాన్యం కొనుగోలు వివరాలను నమోదు చేసి కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులుపై సూచనల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా పూర్తి చేసేలా సహకరించాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital