Wednesday, November 20, 2024

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తాం : భట్టి విక్రమార్క

పరిగి, ప్రభన్యూస్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంత ప్రజల సాగునీటి గోస తీర్చుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరింత నిర్లక్ష్యానికి గురైందని తన పాదయాత్రలో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. హాత్‌ సే హాత్‌ జోడోయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర మార్చ్‌ నెల 16న ఆదిలాబాద్‌ జిల్లా భోద్‌ నియోజకవర్గం బజార్‌ హత్నూర మండలంలో ప్రారంభమైన యాత్ర ఆదివారం రాత్రి పరిగి మండలం తొండపల్లి గ్రామానికి చేరుకుంది. పరిగి మండలానికి చేరుకున్న భట్టి విక్రమార్కకు డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకుంటే అవేమీ ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత లాభం కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే స్వరాష్ట్రంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యేదన్నారు. రీడిజైన్‌ పేరుతో చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు మంగళం పాడారని అన్నారు. ఇటు- పాలమూరు-రంగారెడ్డి ప్రారంభించడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం త్రాగునీటి కోసమేనని ప్రభుత్వం నివేదికలు ఇవ్వడంతో ఈ ప్రాంత రైతుల ఆశలు అడిఆశలయ్యాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులను కేసీఆర్‌ సర్కారు పట్టించుకోకపోవడంతో లక్షలాది ఎకరాలకు నీరు అందకుండా పోతోందన్నారు. పదివేల కోట్లు- ఖర్చు చేసి చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టును కాదని కాళేశ్వరం కట్టారని తెలిపారు.

- Advertisement -

మేం అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంత భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. కె.పి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పూర్తిచేసి తీరుతామన్నారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. నెలకు 4000 నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రెండుసార్లు అధికారం ఇచ్చినా బీఆర్‌ఎస్‌ పార్టీ నేటికీ ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు. పాదయాత్ర చేసిన ఏ గ్రామంలో కూడా భగీరథ నీరు కనిపించలేదన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, పింఛన్లు ఏమీ కూడా సరిగ్గా రావడం లేదన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్‌ చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హామీలు అమలు చేయని బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు- అడిగే హక్కు లేదన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వచ్చే అన్ని స్థానాల్లో గెలుస్తామన్నారు. పరిగెలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మెజారిటీ-తో గెలవడం ఖాయం అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తొండపల్లి సర్పంచ్‌ గీత హనుమంత రెడ్డి, చిట్యాల సర్పంచి రజిత రాజ పుల్లారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ లాల్‌ కృష్ణ ప్రసాద్‌, నాయకులు హనుమంతు ముదిరాజ్‌, మండల పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, దోమ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దోరశెట్టి శాంతి కుమార్‌, నాయకులు యాదవ రెడ్డి, జంగారెడ్డి, భీమ్‌ రెడ్డి ఆంజనేయులు నర్సింలు ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement