హైదరాబాద్, ఆంధ్రప్రభ: బాల నేరస్థుల్లో పరివర్తన తీసుకొస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ సైదాబాద్‌లోని రాష్ట్ర జ్యువినైల్ హోంలో విద్యార్థుల విలు విద్య ప్రదర్శన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
జువినైల్ హోమ్ అంటేనే పరివర్తన కేంద్రమనే అర్థం వస్తుందన్నారు. ఇక్కడి నుంచి మంచి లక్షణాలతో బయటకు వెళ్ళాలని, అంతేకాకుండా ఎదుటి వారిని గౌరవించి, ప్రేమించి, అభిమానించాలని సూచించారు. సమాజంలో చక్కగా మెలుగుతూ, చిన్న పొరపాటు కూడా చేయకూడదని హితబోధ చేశారు.
జువినైల్ హోంలో ఉన్నన్ని రోజులు శిక్షా కాలం కాదని, శిక్షణా సమయమన్నారు. జ్యువినైల్ హోం నుంచి విడుదలైన తర్వాత తల్లిదండ్రల వద్దకు క్షేమంగా చేరుకోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లో జ్యువినైల్ హోంకు రావాల్సి వచ్చిందో, ఆ పరిస్థితుల ప్రభావం మళ్లి జీవితంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.
ఈ అబ్జర్వేషన్ హోం మీకు కచ్చితంగా అండగా ఉంటుందని, మానసికంగా బలోపేతమై సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. బాల నేరస్థుల సంక్షేమం దృష్ట్యా జ్యువినైల్ హోంలో లైబ్రరీ, యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు స్పూర్తి ప్రదాతల పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు.
తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. జాతిపిత గాంధీజీ బోధనలు అనుసరించి సోదర భావంతో మెలగాలని కోరారు. మానసికంగా, శారీరకంగా ఎదిగి మీ సృజనాత్మకతకు పదును పెట్టాలన్నారు. ఇందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందన్నారు. జ్యువినైల్ హోంలో సిబ్బంది మానవతా దృక్పథంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ స్పెషల్ అబ్జర్వేషన్ హోంలో 72 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి విద్యా, వృత్తిపరమైన కోర్సులతో సహా టాటా టెక్నికల్ సపోర్ట్‌తో సాంకేతిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామన్నారు. విలు విద్యలో నేషనల్ గేమ్స్ వరకు రాణిస్తున్నామన్నారు. మరిన్ని అవకాశాలు కల్పించి యోగ్యులుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వమే తల్లి దండ్రి అనే భరోసా ఇస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.
పిల్లల్లో ప్రతిభను వెలికి తీసి, అన్ని విధాలుగా వారి భవిష్యత్తు చక్కగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఆర్చర్ విద్యను ప్రదర్శించిన విద్యార్థుల గురి పట్ల మంత్ర ముగ్దురాలైన మంత్రి సీతక్క బాణాన్ని స్వయంగా సంధించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.