Tuesday, November 26, 2024

చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యలను పార్లమెంటు దృష్టికి తెస్తాం: కనకమేడల

 
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను పార్లమెంటులోనూ ప్రస్తావిస్తామని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం జరిపిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆయన, అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతపై వ్యవహరిస్తున్న తీరు గురించి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కల్గిస్తున్న ‘ఓమిక్రాన్’ వైరస్ గురించి అఖిలపక్షంలో చర్చించినట్టు కనకమేడల తెలిపారు.

సామాన్యుడిపై భారాన్ని తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ తగ్గించడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏకరూపత ఉండేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని కోరినట్టు చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ ఆ మేరకు చట్టం చేయాలని కోరామన్నారు.
 
విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్టు కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి అమరావతినే రాజధానిగా కొనసాగేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో ఏపీలో అపార నష్టం సంభవించిందని, అయితే ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోకుండా కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని, గాడిలో పెట్టేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement