దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నదని, దీంతో పాత వాహనాలు భారీగా పేరుకుపోతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ 150 కి.మీ దూరంలో ఓ వాహన తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణాసియా ప్రాంతమంతటికీ.. తుక్కు వాహన కేంద్రంగా మారే సత్తా భారత్‌కు ఉందన్నారు. పాత వాహనాలతో కాలుష్యం మరింత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత వాహనాలను స్క్రాప్‌గా మార్చితే.. కొంత ఇబ్బంది తగ్గుతుందని వివరించారు. తుక్కు కేంద్రం ఏర్పాటుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిన్నా, పెద్ద తేడా అనేది లేకుండా తుక్కు కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. నగరాలతో పాటు పట్టణాల్లో కూడా తుక్కు కేంద్రాల ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిపారు. నేపాల్, భూటాన్, మాల్దివులు, మయన్మార్, బంగ్లాదేశ్‌లోని కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే సత్తా భారత్‌కు ఉందన్నారు. మెటల్ రీసైక్లింగ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న సంస్థలు.. ఆదర్శ జిల్లాల్లోనూ తుక్కు కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
రెండేళ్లలో 3కోట్ల ఈవీలు..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరుగుతుందని, వచ్చే రెండేళ్ల కాలంలో 3కోట్ల ఈవీ వాహనాలకు చేరుకుంటుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్‌లో స్టార్టప్ ఉత్పత్తులను ప్రారంభించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారతదేశంలో అత్యధిక యువ ప్రతిభావంతులు ఉన్నారని, ఈ వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం దాదాపు 250 స్టార్టప్‌లు పని చేస్తున్నాయని తెలిపారు. అవి నిజంగా మంచి స్కూటర్‌లను తయారు చేశాయన్నారు. స్కూటర్లు కూడా భారీగానే బుకింగ్ అయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని, డిసెంబర్ చివరి నాటికి వాటి సంఖ్య 40 లక్షలకు చేరుకుంటుందని, వచ్చే రెండేళ్లలో వాటి సంఖ్య 3 కోట్లకు చేరుతుందని తెలిపారు. ఈవీ సెగ్మెంట్‌లోని పెద్డ బ్రాండ్‌ల గుత్తాధిపత్యాన్ని చిన్న బ్రాండ్‌లు మార్కెట్‌లోకి తీసుకురావడంతో చిన్న బ్రాండ్‌లు సవాలు చేస్తున్నాయని అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నాయని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..