Tuesday, November 19, 2024

మెరుపువేగంతో దాడి చేస్తాం.. పశ్చిమ దేశాలకు పుతిన్‌ తాజా వార్నింగ్‌

కీవ్‌, ప్ర‌భ‌న్యూస్ : ఉక్రెయిన్‌ వ్యవహారాల్లో ఇతర దేశాలు ఏవైనా వేలుపెడితే మెరుపువేగంతో వారిపై దాడులు చేస్తామని, అవసరమైన పక్షంలో అణ్వాయుధాలు వాడి తీరుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పశ్ఛిమ దేశాలను మరోసారి హెచ్చరించారు. పదేపదే ఈ విషయాన్ని చెబుతున్నానని, పరిస్థితులు అర్థం చేసుకుని ఉక్రెయిన్‌ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా రెండు నెలల తరువాత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. సొంత సైన్యం, ఆయుధాలను పెద్దసంఖ్యలో కోల్పోయినప్పటికీ వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ రాజధానిపై మొదట దాడి చేసి వెనక్కు తగ్గిన రష్యా తూర్పు, ఉత్తర ప్రాంతాలపై దాడులు ముమ్మరం చేసింది. గురువారం నాడు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. మరోవైపు ఉక్రెయిన్‌కు పశ్ఛిమ దేశాలనుంచి పెద్దఎత్తున సాయం అందుతోంది. వివిధ దేశాలనుంచి అందుతున్న ఆయుధాలతో ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తూండటంతో పుతిన్‌ కారాలుమిరియాలు నూరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మరోసారి అణుబూచిని చూపిస్తూ వార్నింగ్‌ ఇచ్చారు. తూర్పు ప్రాంతంలోని స్లొబొఝాన్‌స్కె, డోనెట్స్‌, ఖార్కివ్‌ ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాలపై గురువారం రష్యా దాడులు పెంచిందని ఉక్రెయిన్‌ సైనికాధికారులు చెప్పారు. రష్యా ఆధీనంలోని లిజియుమ్‌ నుంచి దాడులకు తెగబడుతోందని, అయినా ఉక్రెయిన్‌ సైనికులు ఎదురొడ్డి పోరాడుతున్నారని చెప్పారు. అటు ఖేర్చన్‌లోనూ పెద్దఎత్తున పేలుళ్లు సంభవించాయని, మైకోలైవ్‌, క్రివి రిహ్‌ నగరాలపైనా బాంబులు కుమ్మరించిందని ఉక్రెయిన్‌ సైనికాధికారులు వెల్లడించారు. కాగా ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతంలో రష్యా వ్యతిరేక ప్రదర్శనలు పెద్దఎత్తున సాగాయి. కాగా జర్మనీ సహా దాదాపు 40 దేశాలు ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఉక్రెయిన్‌ ఒంటరిగా రష్యాను ఎదుర్కోలేదని, నాటో తెరవెనుకనుంచి సాయం అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భావిస్తున్నారు. కాగా ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌ అన్ని అంశాల్లోనూ ఎదురుదెబ్బ తిన్నారని, ఆ నైరాశ్యంతోనే ప్రపంచ దేశాలను బెదరించేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఐరోపా దేశాలపై రష్యా ప్రతీకార చర్యలకు దిగుతోంది. రూబుల్‌లో చెల్లింపులకు నిరాకరించాయన్న నెపంతో పోలండ్‌, బల్గేరియాలకు గ్యాస్‌ సరఫరాను రష్యా నిలిపివేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement