తిరుమల (ప్రభన్యూస్): సేలం వినియోగదారుల కోర్టు తీర్పుపై తాము అప్పీలుకు వెళ్తామని టీటీడీ ఇవ్వాల (ఆదివారం) వెల్లడించింది. కరోనా సమయంలో ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలోనే స్వామివారి సేవలన్నీ రద్దు అయ్యాయని, అయితే ముందే బుక్ చేసుకున్న వారికి కొంత వెసలుబాటుతో అవకాశం కల్పించినట్టు టీటీడీ తెలిపింది. కానీ, ఆ అవకాశాన్ని వినియోగించుకోని వారు హైకోర్టుకు వెళ్లారని, అప్పుడు టీటీడీకి అనుకూలంగా తీర్పు వచ్చిందని అధికారులు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం తనకు కల్పించలేదని తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ఓ భక్తుడు వినియోగదారుల కోర్టుకు వెళ్లాడు. దీనికి స్పందించిన వినియోగదారుల న్యాయస్థానం ఆ భక్తుడికి కావాల్సిన సేవ అందజయాలని, లేని పక్షంలో 50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కాగా, మేల్ చాట్ వస్త్ర సేవ నిమిత్తం బుక్ చేసుకున్న భక్తుడు హరిభాస్కర్‌కు ఆ సేవను అందించకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది.
అయితే.. ఈ తీర్పుపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవ్వాల (ఆదివారం) స్పందించింది. కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి 20వ తేదీ నుంచి 2022 మార్చి వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. అదే కాలంలో అడ్వాన్స్ రిజర్వేషన్్‌లో 17,946 ఆర్జిత సేవా టిక్కెట్లు పొందిన భక్తులకు ఈ రద్దు కారణంగా నగదు వాపసు కానీ, వీఐపీ బ్రేక్ దర్శనం కానీ చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు టీటీడీ తెలిపింది. అయితే.. ఈ అవకాశాన్ని 95శాతం మంది భక్తులు వినియోగించుకున్నారని, ఇంకొంతమంది మాత్రం ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని తెలిపింది.
ఇట్లాంటి వారిలో కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారని అయినా అక్కడ తీర్పు టీటీడీకి అనుకూలంగా వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ క్రమంలో తమ పొరపాటు ఏమీ లేదని, చాన్స్ ఇచ్చినా వినియోగించుకోకుండా దేవుని పేరుతో ఇట్లా వితండ వాదం చేయడం అంత మంచిది కాదని అధికారులు అంటున్నారు. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రంలోని సేలం వినియోగదారుల కోర్టు తీర్పుపై తాము అప్పీలుకు వెళ్లనున్నట్టు టీటీడీ ఇవ్వాల తెలిపింది.