శశికళ తమ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు బిజెపి సీనియర్ నేత నైనార్ నాగేంద్రన్. ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా తమిళనాడు అన్నాడీఎంకేను బీజేపీ నడిపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.. మరోవైపు శశికళ కూడా అన్నాడీఎంకేలో తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. శశికళను బీజేపీలోని ఆహ్వానిస్తామని నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. నాగేంద్రన్ విషయానికి వస్తే.. ఆయన గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జయలలిత మరణం తర్వాత అప్పటి అధికార అన్నాడీఎంకేకు గుడు బై చెప్పిన నాగేంద్రన్.. కాషాయ కండువా కప్పుకున్నారు.
అన్నాడీఎంకే నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించి.. ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. శశికళను ఏఐఏడీఎంకే వారి పార్టీలో చేర్చుకోవాలి. అది వారిని బలపరుస్తుంది. శశికళ చేరికను అన్నాడీఎంకే వ్యతిరేకిస్తే.. ఆమె ఒకవేళ బీజేపీలో చేరితే మేము స్వాగతిస్తాం. ఇది బీజేపీకి మద్దతు ఇస్తుందని చెప్పారు. అదే సమయంలో అధికార డీఎంకేపై నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు ఓపీఎస్ సుముఖంగానే ఉన్నారని.. అయితే ఈపీఎస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు శశికళను అన్నాడీఎంకేలో తిరిగి చేరేలా బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది..మరి బిజెపిలోకి వెళ్ళేందుకు శశికళ సుముఖంగా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది.