Wednesday, November 13, 2024

Delhi | చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్రానికి చెప్పాం.. అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై పెట్టిన అక్రమ కేసు గురించి కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల ఉభయసభల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు.

టీడీపీ తరఫున ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ హాజరయ్యారు. సమావేశం అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టం గడువు పూర్తవుతున్న అందులోని హామీల అమలు గురించి అడిగామని తెలిపారు.

మహిళా బిల్లు గురించి కూడా ప్రస్తావించామని చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణ గురించి ప్రధాన మంత్రి గతంలో మాట్లాడారని, అందుకు తగిన మౌలిక వసతుల కల్పన చేయాలని అన్నారని గుర్తు చేశారు. ఏపీలో చూస్తే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఉన్నారని, ఆయనపై కేసుల విచారణ పూర్తికాలేదని, త్వరగా పూర్తిచేయాలని కోరామని కనకమేడల తెలిపారు.

- Advertisement -

అదే సమయంలో చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు గురించి కూడా చెప్తుండగా, ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు అడ్డుతగిలారని అన్నారు. అయినా సరే రాజ్‌నాథ్ సింగ్ తమకు మాట్లాడే అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. వారిపై ఉన్న అవినీతి ముద్రను తమ నాయకుడిపై వేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఈ అంశంపై అఖిలపక్షంలోనే కాదు, పార్లమెంటు లోపల కూడా లేవనెత్తుతామని ఆయన నొక్కి చెప్పారు.

అంతకుముందు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జంతర్ మంతర్‌లో టీడీపీ శ్రేణులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో టీడీపీ ఎంపీలు పాల్గొని మద్దతు తెలిపారు. ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుణ్ని అక్రమ కేసులతో జైల్లో పెట్టి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కానీ ప్రజలు తిరగబడుతున్నారని, మహిళలు, యువత రోడ్ల మీదకు వస్తున్నారని అన్నారు.

సొంత రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. జగన్ తన మీద ఉన్న అవినీతి మరకలు చంద్రబాబునాయుడుకు అంటించి రాక్షసాంనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. ఆయనకు భద్రత లేదని తాము అంటుంటే, జైల్లో భద్రత అని వారంటున్నారని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తామని రామ్మోహన్ నాయుడు వివరించారు.

ఈ అంశంపై న్యాయపోరాటంతో పాటు ప్రజాక్షేత్రంలోనూ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీప చిత్తుచిత్తుగా ఓడిపోబోతోందని ఆయన జోస్యం చెప్పారు. న్యాయస్థానంలో చెప్పాల్సిన విషయాలను సీఐడీ ఏడీజీ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ ప్రజాక్షేత్రంలో చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇది అధికార దుర్వినియోగమన్న ఆయన, రేపు దీనిపై అన్ని రకాల విచారణ ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. ఏపీలో మీడియా సమావేశం పెట్టారంటే అర్థం ఉంది కానీ పొరుగు రాష్ట్రం హైదరాబాదుకు వచ్చి మరీ మీడియా సమావేశం పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది సర్వీస్ రూల్స్‌కి పూర్తిగా విరుద్ధమని, తాము వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement