ప్రీమెచ్యూర్ బేబీస్ ఆరోగ్యం కోసం, అకాన్ రెస్టో బార్ & ఎక్స్ట్రా మైల్ సంయుక్తంగా నిర్వహించిన బంతి భోజనం కార్యక్రమం ఎంతో విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిసెస్ ఇండియా (2004) పారిశ్రామికవేత్త శిల్పారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజం పట్ల మన బాధ్యతను గుర్తు చేసేలా ఏర్పాటు చేసిన అరుదైన కార్యక్రమం ఒక వైపు సాంప్రదాయ రుచులను అందిస్తూ మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఉందని అన్నారు.
“మన చుట్టూ ఉన్న సమాజానికి మన వంతు సహాయం అందించడం చాలా గొప్ప విషయం. అకాన్ రెస్టో బార్ వినూత్న రీతిలో బంతి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. దక్షిణాధి వంటలతో ఏర్పాటు చేసిన ఈ విందు ఆరగించి తమకు తోచినంత ఇవ్వడం అనేది అద్భుతమైన ఆలోచన. ఈ విధానం మన సంస్కృతికి అద్దం పడుతుంది.
కడుపునిండా తినండి.. మీకు తోచినంత చెల్లించండి అంటూ మనలోని దయ గుణాన్ని పెంచేలా ఉంది. మన దేశంలో మనం గర్వపడే విషయాలు చాలా ఉన్నాయి. మన గురించి మనమే ఆలోచించుకుంటున్నామా మన కుటుంబానికే కాకుండా మనతోటి మనుషులకు, జీవజాతికి మన తోచిన చిన్న సహాయం అయినా చేయగలుగుతున్నామా అన్నది ఆలోచించాలి.
మనం చేసే చిన్న సహాయం అయినా ఎంతో పెద్ద ప్రయోజనం చేకూర్చుతుంది. బుద్ది జీవులుగా మనం ఎన్నో రకాలుగా సహాయం అందించవచ్చు. అకాన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల కోసం, వారికి వచ్చే అనారోగ్య సమస్యలను కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు “ఎక్స్ ట్రా మైల్ ” వారి కృషి అభినందనీయం”అని శిల్పా రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా “వీరాంజనేయులు విహారయాత్ర” నటీనటులు రాగ్ మయూర్, ప్రియా వడ్లమణి విచ్చేసారు. రాగ్ మయూర్ మాట్లాడుతూ.. “స్వాతంత్య్ర దినోత్సవం రోజు మన సంస్కృతి సంప్రదాయాలు గుర్తుకు తీసుకువచ్చేలా ఒక మంచి కార్యక్రమాన్ని అకాన్ రెస్టో బార్, ఎక్స్ ట్రా మైల్ వారు కలిసి నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం అందించి సమాజం పట్ల మన బాధ్యతను గుర్తు చేసేలా అరుదైన కార్యక్రమాన్ని నిర్వహిచడం అభినందనీయం” అన్నారు. చిన్నారులకు వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ బంతి భోజనం ఆలోచన ఎంతో గొప్పగా ఉందని సినీ నటి ప్రియా వడ్లమణి అన్నారు.
నెలలు నిండకుండా పుట్టిన పిల్లల కోసం, వారికి వచ్చే అనారోగ్య సమస్యలను కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు “ఎక్స్ ట్రా మైల్ ” పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ నితీష చెప్పారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల కోసం మూడు సంవత్సరాల క్రితం తాను ఎక్స్ ట్రా మైల్ ఆర్గనైజేషన్ ను ప్రారంభించి వాళ్ళకి అవసరమైన వైద్యచికిత్సను అందించడానికి ఆర్థిక సహాయాన్ని ఈ సంస్థ ద్వారా అందిస్తున్నామన్నారు.
ఇప్పటివరకు 197 మంది ప్రీమెచ్యూర్ బేబీస్ కి తాము ఆర్థిక సహాయం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి కాపాడమని ఆమె చెప్పారు. చిన్నారుల కోసం ప్రతి ఏటా ఫండ్ రేజింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈరోజు ఆగాన్ వారితో కలిసి ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
నవంబర్ 17న ప్రీమిచ్యూర్ బేబీస్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం నిర్వహిస్తామని త్రీ కే, ఫైవ్ కే రన్స్ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమాల ద్వారా వచ్చే ఫండ్ అంతా కూడా చిన్నారుల కోసం ఉపయోగిస్తామని, వారికి అవసరమైన వైద్య చికిత్సను నగరంలోని అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ లలో అందిస్తున్నామని ఆమె చెప్పారు. చిన్నారుల వైద్య చికిత్స కోసం అవసరమైన నిధుల సేకరణలో భాగంగా ఎక్స్ ట్రా మైల్ సంస్థతో కలిసి బంతి భోజన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని అకాన్ రెస్టో బార్ నిర్వాహకులు జి. నాగేశ్వర్ రెడ్డి, జి. నీహాల్ రెడ్డి అన్నారు.
ఆనందదాయకమైన సంగీతం వింటూ ఆరోగ్యకరమైన ఆహారం తింటూ తమ వంతు బాధ్యతగా సమాజానికి చిరు సహాయం అందించడం అనేది గొప్ప అనుభూతిని అందించాలన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు అకాన్ రెస్టో బార్ లో అవసరార్థులకు అండగా నిలుస్తూ, వారిలో స్వేచ్ఛా స్ఫూర్తిని నింపే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతిభావంతులైన పాకశాస్త్ర నిపుణులు,కళాకారులు ఒక చోటకు చేరి పసందైన విందును, అతిథులకు అనందానుభవలను అందించారని.
‘అకాన్ ఆహ్వానం ‘ పేరుతో నిర్వహించిన బంతి భోజనం చేయండి మీకు నచ్చిన విధంగా చెల్లించండి ‘ అనే కాన్సెప్ట్ చాలాసంతోషాన్ని ఇచ్చిందన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను నిరుపేద కుటుంబాలకు చెందిన నెలలు నిండని శిశువుల ఆరోగ్యం కోసం ఇస్తామన్నారు.
దాతృత్వ హృదయంతో ఇలాంటి గొప్ప పనులు చేపట్టే ఎక్స్ట్రామైల్ ఫౌండేషన్ ఈ ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని శిశువుల చికిత్సకు ఉపయోగించాలని వారు ఆకాంక్షించారు. “ మా అతిథుల్లో ప్రతి ఒక్కరూ అవసరమైన వారి జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకురావడానికి సహాయం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని నిహాల్ రెడ్డి గుర్రాల అన్నారు.