Thursday, November 14, 2024

TG | మీ భవిష్యత్తునే రాష్ట్ర భవిష్యత్తుగా చూస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

మీ భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం చూస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటాం.. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు.

గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “భవిష్యత్తు ఈ రోజు కోసం సిద్ధపడే వారిదే” అని చెప్పిన మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలను ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నదని అన్నారు.

- Advertisement -

విద్య వ్యవస్థకు పునాదులు వేసిన నెహ్రూ బాటలోనే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని వెల్లడించారు.

అదే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలల మరమ్మత్తులకు 100 కోట్లకు పైగా కేటాయించి విద్యార్థులకు సకల సౌకర్యాలు వసతులు కల్పించిందన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించడానికి మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి మండలి సభ్యులందరం ఆలోచన చేసి విద్యార్థులకు 40% మెస్ చార్జీలు పెంచామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ అందించలేదన్నారు.

ప్రజా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభమైన రోజునే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను అందించిందని వివరించారు.

దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గుండు సూది సైతం ఉత్పత్తి చేయలేని ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసి భారతదేశం యొక్క పారిశ్రామికీకరణ, శాస్త్రీయ అభివృద్ధి, విద్యా విస్తరణకు నెహ్రూ పునాదులు వేసినందునే అంతరిక్షంలోకి రాకెట్లను పంపే అభివృద్ధికి దేశం పురోగతి చెందిందని వెల్లడించారు.

ఆధునిక దేవాలయాలు పిలుచుకునే బహులార్ధక సార్థక ప్రాజెక్టులు ఆయన ఆలోచనలే అని చెప్పారు. కృష్ణానదిపై నాగార్జునసాగర్, గోదావరి నదిపై ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రం మీదుగా రెండు జీవ నదులు పారించేందుకు చాచా నెహ్రూ వేసిన పునాదుల ఫలితంగానే తెలంగాణలో లక్షల ఎకరాలకు, వేల గ్రామాలకు సాగు తాగు నీరు అందుతున్నదన్నారు.

శాస్త్రీయ విద్య, ఉపాధి కల్పనకు ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థల స్థాపనకు నెహ్రూ వేసిన పునాదులే అని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వంతో ఈ దేశాన్ని నడిపి అటు అమెరికా కూటమి ఇటు రష్యా కూటమికి దూరంగా అలీన విధానంతో సమదూరం పాటించి స్వతంత్రంగా వ్యవహరించి ప్రపంచ దృష్టిని మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆకర్షించారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించిన నెహ్రూ జీవితం ఆయన అనుసరించిన అలీన విధానం అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు సైంటిఫిక్ టెంపర్మెంటు ఈ దేశానికి ఇప్పటికీ ఎప్పటికీ దశా దిశా నిర్దేశంగా ఉంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement