Monday, November 25, 2024

గడపగడపనూ తాకాలి.. ప్రజలతో మమేకం కావాలి : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

న‌ల్గొండ‌: కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో లేవు అని, దేశంలో 50 లక్షల ఆసరా ఫించన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మర్రిగూడ మండలం దేవర భీమనపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తోపాటు ఎంపీటీసీ విష్ణు, మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు, వార్డు మెంబర్లు తిరుమల్ రెడ్డి, చాంద్ పాష, అంజా చారి , సీనియర్ నాయకులు నాగిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అక్కడే పార్టీ కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం భోజ్య తండా, భీమ్లా తండాలలో ప్రచారం మంత్రి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులలో దేశంలో తెలంగాణతో పోటీ పడగలిగే రాష్ట్రం మరొకటి లేదన్నారు. దశాబ్దాల పాటు ఫ్లోరైడ్ సమస్యతో ఈ ప్రాంతం మూడు తరాలను నష్టపోయింద‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో స్వయంగా ఫ్లోరైడ్ సమస్యపై పాటలు రాశార‌ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో బస్సు యాత్ర చేశారు, అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఫ్లోరైడ్ ప్రాంతాలకు రక్షిత తాగునీరు అందించార‌న్నారు. కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మూలంగానే ఇది సాధ్యమయింద‌న్నారు. మునుగోడు కష్టాలు తీర్చింది టీఆర్ఎస్, తీర్చబోయేది టీఆర్ఎస్ మాత్రమే అన్నారు. ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయ‌ని, నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీ మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement