హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెెలంగాణలో విస్తారంగా ప్రవహిస్తూ, ఆరు జిల్లాల వ్యవసాయ భూములకు జీవనాధారమైన కృష్ణా నది నీటి వాటాల్లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర నీటి పారుదల శాఖ కేఆర్‌ఎంబీని నిలదీసేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర విభజన సమయంలో తాత్కాలికంగా సంవత్సరం పాటు నిర్ణయించిన నీటివాటాలే 10 సంవత్సరాలుగా కొనసాగించడాన్ని తెలంగాణ తప్పుబడుతోంది. కృష్ణా నీటి వాటల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులపై ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక ఫిర్యాదులు చేసిన తెలంగాణ సోమవారం జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో కృష్ణా నీటి వాటాలో ఆంధ్ర, తెలంగాణకు సమానంగా ఉండాలనే వాదనలను మరోసారి తెరమీదకు తేనుంది.
మహారాష్ట్ర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పుట్టిన కృష్ణా నది సముద్రమట్టానికి 1337 మీటర్ల ఎత్తులోంచి ప్రయాణించి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ మండలం తంగిడి గ్రామంలోకి కృష్ణా ప్రవేశిస్తోంది. డిండి, బీమా, మూసీ, హాలియా, పాలేరు, మున్నేరు నదులను కలుపుకుంటూ కృష్ణా నది 450 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో పరవళ్లు తొక్కుతున్నా నీటి వాటాల్లో అన్యాయం జరిగింది. తలాపున కృష్ణా ప్రవహిస్తున్నా మహబూబ్ నగర్ ఎడారిగా మారిందని తెలంగాణ ఉద్యమంలో విచారం వ్యక్తం చేసిన కేసీఆర్ రాష్ట్రంసిద్ధించగానే సీఎం హోదాలో నీటి వాటాలపై పట్టుబిగించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న 66:34 వాటాను అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి నియమావళి మేరకు నీటివాటాలపై మార్గనిర్ధేశం చేసింది. ఈ మేరకు రాష్ట్రాల అభ్యంతరాలపై కేఆర్‌ఎంబీ నివేదికలు రూపొందించి కేంద్ర జలశక్తి శాఖకు పంపించాల్సి ఉంది. అలాగే ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ కృష్ణా జలాలను వాటాకు మించి 51 టీఎంసీ ని వినియోగించిందని శాస్త్రీయ అధ్యయనంలో స్పష్టం కాగా తెలంగాణ తన నీటి వాటా నుంచి 18 టీఎంసీని మిగిలించుకోంది. ఈ మిగులు జలాలను వాటాలో అదనంగా కలపడంతో పాటుగా ఏపీ వాటా నుంచి 51 టీఎంసీలను తగ్గించాలని త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ వాదించనుంది.
అలాగే కొత్తట్రబ్యునల్ ఏర్పాటు చేసి నీటిపంపకాలను చేపట్టాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌ను మరోసారి త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. శ్రీశైలం నుంచి 34 టీఎంసీల పరిమితి ఉన్న ఏపీ నిబంధనలకు మించి నీటిని తోడుకోవడంతోనే శ్రీశైలం డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నదని తెలంగాణ ఆక్షేపిస్తోంది. పోతిరెడ్డిపాడుకు 80వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తూ శ్రీశైలం ఎండబెట్టడంతో శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పాదనకు నీటి సరఫరా సమస్యగా మారిందని తెలంగాణ విచారం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు నిలిపివేయాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ కృష్ణా యాజమాన్యం బోర్డుకు, కేంద్ర జలశక్తికి, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ ఏపీ పనులు నిలిపివేయకపోవడంతో తెలంగాణ న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జరుగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. ఈ త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు, ఆంధ్ర ఈఎన్సీ నారాయణరెడ్డి, కృష్ణా యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే ఉన్నారు. వీరితో పాటుగా రెండురాష్ట్రాల సీనియర్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొననున్నారు.
ఇప్పటికే తెలంగాణ కమిటీ ముందు వాదించే అంశాలపై నివేదికలు రూపొందించింది. ఇందులో ప్రధానంగా నీటి వాటా పెంపు, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెెంపును నిలిపివేయాలి, నాగార్జున సాగర్ నుంచి ఎడమకాలువకు నీటిని విడుదల చేయాలి. ఇప్పటికే అదనంగా కృష్ణా జలాలను వినియోగించుకున్న ఏపీ మరో 16 టీఎంసీలు కావాలని చేస్తున్న డిమాండ్‌ను తిరస్కరించాలి, పట్టిసీమ నుంచి కృష్ణాలో కలుస్తున్న నీటిలో వాటా కావాలనే ప్రధాన డిమాండ్‌లపై చర్చకు తెలంగాణ పట్టుబట్టనుంది.