రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఇప్పటి వరకు తమ దేశానికి చెందిన 13వేల మంది సైనికులు చనిపోయి ఉంటారని జెలెన్ స్కీ సలహాదారు మైఖెలో పోదోలియాక్ చెప్పారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం 12,500 నుంచి 13 వేల మంది సైనికులు చనిపోయారని తెలిపారు. ఇంతే సంఖ్యలో సైనికులు గాయపడ్డారని చెప్పారు. మరణాల విషయంలో తాము ఏదీ దాచడం లేదని అన్నారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టి లక్ష మందికి పైగా సైనికులను రష్యా కోల్పోయిందని అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
నెలలు గడిచిపోతున్నా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు కార్డు పడలేదు. ఇంకెంత కాలం కొనసాగుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. సర్వం కోల్పోతున్నా, నగరాలు శ్మశానాలను తలపిస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఏమాత్రం తగ్గడం లేదు. చివరి శ్వాస వరకు తగ్గేదే లే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ భారీ సంఖ్యలో సైనికులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించాలని రష్యా, ఉక్రెయిన్‌లను ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.