న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 2016లో తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి, దహనం ఘటనల్లో కాపుగర్జన మహాసభ నేతలపై నమోదు చేసిన కేసుల్లో ఐదింటిని ఉపసంహరించుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ అంశంపై మొదటిసారిగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ఘటనల్లో రైల్వే శాఖ (గవర్నమెంట్ రైల్వే పోలీసులు) నమోదు చేసిన 5 కేసులను ఉపసంహరించుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అయితే మరో రెండు కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు.
ఇందులో ఒకటి రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు కాగా, మరొకటి రాజమండ్రిలోని సీఐడీ నమోదు చేసిన కేసు అని వివరించారు. అనుబంధంగా అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ ఈ రెండు కేసులను ఉపసంహరించుకోడానికి ఎలాంటి అభ్యర్థన, ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర మంత్రి పేరిట ఓ లేఖ రాస్తూ ఆ రెండు కేసులను కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా అభ్యర్థించారు. అనంతరం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన జీవీఎల్, కాపు నేతలపై కేసుల ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.