న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని 5 విమానాశ్రయాలను గత ఐదేళ్లలో అప్‌గ్రేడ్ చేశామని కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ డా. వీకే సింగ్ గురువారం రాతపూర్వక జవాబిచ్చారు. గత ఐదేళ్లలో ఏపీలో ఓర్వకల్ (కర్నూలు) విమానాశ్రయాన్ని నిర్మించారని, 2021లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రూ. 187 కోట్ల అంచనా వ్యయంతో ఓర్వకల్ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిందని వెల్లడించారు.
కొత్తగా నిర్మించిన ఓర్వకల్ విమానాశ్రయం సహా అప్పటికే ఉన్న 5 విమానాశ్రయాల సామర్థ్యం పెంపుతో మొత్తం ఏపీలో విమాన ప్రయాణికుల సామర్థ్యాన్ని ఏడాదికి 10 మిలియన్లు (1 కోటి)కి పెరిగింది. తద్వారా వీరందరికీ ప్రయోజనం కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. జూన్ 2022 నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విజయవాడ విమానాశ్రయంపై రూ. 134 కోట్లు, తిరుపతి విమానాశ్రయంపై రూ. 131 కోట్లు, రాజమండ్రి విమానాశ్రయంపై రూ. 5 కోట్లు, విశాఖపట్నం విమానాశ్రయంపై రూ. 60 కోట్లు, కడప విమానాశ్రయంపై రూ. 55 కోట్లు ఖర్చు చేసి అప్‌గ్రేడ్ చేశామని కేంద్రమంత్రి వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.