Friday, November 22, 2024

చేపల పెంపకంలో ఆంధ్రాను మించిపోయాం : మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట : నిత్యం ప్రజా సేవతో బిజీగా ఉండే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెరువు వద్ద సందడి చేశారు. సూర్యాపేట రూరల్ మండలంలో పలు కార్యక్రమాలకు హాజరై తిరుగు ప్రయాణంలో దాసాయిగూడెం చెరువు వద్ద మత్స్య కారులు చేపలు పట్టడాన్ని గమనించి కాన్వాయ్ దిగారు.. వెంటనే చెరువు వద్దకు హుటాహుటీన వెళ్లిన మంత్రి, మత్యకార సోదరులు చేపలు పట్టడాన్ని ఆసక్తిగా గమనించారు. వారు పట్టిన కొరమెను చేపలను చేతిలో పట్టుకుని మురిసిపోయారు. తమను చూసి వచ్చిన మంత్రిని చూసిన మత్స్యకార సోదరులు ఆనందంలో మునిగిపోయారు. గతంలో చెరువులలో నీరు లేక చేపలు ఉండేవి కావని, దీంతో కుల వృత్తినే నమ్ముకుని జీవనం సాగించే మేము చాలా ఇబ్బందులు పడినామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మా తలరాతలు మారాయన్నారు.

ప్రభుత్వ సహకారంతొ చెరువులే కాకుండా కుంటలలో సైతం మత్స్య సంపద పెరిగి మాకు చేతినిండా ఉపాధి దొరుకుతుందని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. చేపల పెంపకంలో ఆంధ్రాను మించిపోయాం అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో 2014 వరకు ఆంధ్ర వారికే సొంతం అనుకున్న రికార్డ్ ను బ్రేక్ చేశాం అన్నారు. తెలంగాణలో నీలి విప్లవం వచ్చిందనడానికి మత్స్య సంపదలో దేశంలో నే తెలంగాణ నంబర్ వన్ కు స్థానానికి చేరుకోవడమే నిదర్శనం అన్నారు. తెలంగాణ‌ ఏర్పాటుతోనే చెరువులకు నీరు.. ఆ నీటితోటే ఈ చేపల పెంపకం సాధ్యపడింది అన్నారు. తెలంగాణ చెరువులలో పెరిగిన చేప తెలంగాణ‌ అభివృద్ధికి సంకేతం అన్నారు. రాష్ట్రమే ఏర్పడకుంటే ఇక్కడ చేపల పెంపకం సాధ్యపడేది కాదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement