న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్ పోర్ట్ నిర్మించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13వ షెడ్యూల్‌లో దుగరాజపట్నం వద్ద మేజర్ పోర్ట్ నిర్మించాలని ఉందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ, ఆర్థిక శాఖలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నీతి ఆయోగ్ ఈ విషయంపై అధ్యయనం చేసిందని తెలిపారు. సమీపంలోనే ఉన్న కృష్ణపట్నం, ఎన్నోర్, చెన్నై పోర్టుల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నందున దుగరాజపట్నం వద్ద మేజర్ పోర్ట్ వాణిజ్యపరంగా లాభదాయకం కాదని, మనుగడ కష్టమని ఈ అధ్యయనం తేల్చినట్టుగా వివరించారు.
ఈ మూడు మేజర్ పోర్టులు 40 కి.మీ నుంచి 80 కి.మీ దూరంలోనే ఉన్నాయని వెల్లడించారు. మరో ప్రశ్నకు సమాధానంగా నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అయితే ఆ పోర్ట్ నాన్-మేజర్ పోర్టుగా నోటిఫై అయిందని వెల్లడించారు. రాష్ట్రంలో మరే ఇతర మేజర్ పోర్ట్ ప్రతిపాదన తమ వద్ద లేదని సమాధానంలో పేర్కొన్నారు.