భారత దేశంలో తాము ఏ ఉద్యోగిని బలవంతంగా ఉద్యోగం నుంచి తొలగించలేదని అమెజాన్ ఇండియా కేంద్రానికి తెలిపింది. ఉద్యోగులపై తొలగింపుపై వివరణ ఇవ్వాలని కోరుతూ కార్మిక శాఖ అమెజాన్‌కు నోటీస్‌లు ఇచ్చిన సంగతి తెల్సిందే. కంపెనీలో ఉద్యోగులను చట్ట విరుద్ధంగా తొలించారని కేంద్ర కార్మిక శాఖకు నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్( ఎన్‌టీఈఎస్) కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై కార్మిక శాఖ నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్‌కు సమాధానం ఇచ్చిన అమెజాన్ తాము ఎవరినీ తొలగించలేదని తెలిపింది. ఉద్యోగులు స్వచ్ఛందంగానే విధుల నుంచి వైదొలిగారని తెలిపింది. వారే రాజీనామా చేసి వెళ్లారని వివరణ ఇచ్చింది.
బెంగళూర్‌లోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ముందు అమెజాన్ ప్రతినిధి నేరుగా హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ లిఖిత పూర్వకంగానే సమాధానం తెలిపింది. ప్రతి సంవత్సరం అన్ని విభాగాల్లోని ఉద్యోగులపై సమీక్ష నిర్వహిస్తామని, పునర్ వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే పరిహార ప్యాకేజీ చెల్లిస్తుంటామని తెలిపింది. ఎవరైనా ఉద్యోగి ఈ ప్యాకేజీకి అంగీకరించి వైదొలగవచ్చని, లేదంటే తిరస్కరించే వెసులుబాటు కల్పిస్తుంటామని అమెజాన్ వివరణ ఇచ్చింది. బలవంతంగా ఎవరినీ తొలగించలేదని, ఇష్టం లేని వారు రాజీనామా చేశారని పేర్కొంది.
దేశంలో ప్రస్తుతం 1.15 మిలియన్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించామని అమెజాన్ ఇండియా తెలిపింది. 2025 నాటికి 2 మిలియన్ల ఉద్యోగాలు సృష్టిస్తామని హామి ఇచ్చింది. అమెజాన్‌కు కర్నాటక, తమిళనాడులో కార్యాలయాలు ఉన్నాయి.
అమెజాన్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది. 2023లోనూ తొలగింపులు ఉంటాయని ప్రకటించింది.