ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 16 శాతమని, ప్రపంచంలో అత్యధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న ఏకైక దేశంగా భారత్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… ప్రపంచంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచ దేశాలకు భారత్ ఆశాజ్యోతి అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి 8శాతంతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. తాము కోవిడ్ మహమ్మారిని అధిగమించి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లామన్నారు.
3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తున్నామన్నారు. భారతదేశం రోజుకో కొత్త మైలురాయిని చేరుకుంటోందన్నారు. బడ్జెట్‌లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు దక్కాయన్నారు. గత 10 ఏళ్లలో భారతదేశ బడ్జెట్ కూడా 3 రెట్లు పెరిగి రూ.48 లక్షల కోట్లకు చేరుకుంది. 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు మూలధన వ్యయం రూ.90 వేల కోట్లు. తర్వాత అది 2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇప్పుడు 5 రెట్లు పెరిగి రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, మంత్రిత్వ శాఖలకు కేటాయించే నిధులు పెరిగాయన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చేస్తున్న కృషి, చర్యలు అపూర్వమైనవని మోదీ అన్నారు. గత కాంగ్రెస్ హయాంతో పోలిస్తే రైల్వే బడ్జెట్ 8 రెట్లు, హైవే బడ్జెట్ 8 రెట్లు, వ్యవసాయ బడ్జెట్ 4 రెట్లు, రక్షణ బడ్జెట్ 2 రెట్లు పెరిగిందన్నారు. బీజేపీ పాలనలో 25కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారన్నారు. తాము నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, సులభమైన జీవనంపై దృష్టి పెడతామన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 1.40 లక్షల స్టార్టప్‌లు ఉన్నాయన్నారు. ముద్ర పథకం కింద 8 కోట్ల మంది రుణాలు తీసుకుని వ్యాపారం ప్రారంభించారన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం మనకు చాలా అవసరమన్నారు.
ఈ ప్రయాణంలో దేశం పురోగమిస్తూనే ఉందన్నారు. తాము పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశంపై దృష్టి సారించామన్నారు. ఇందులో తమకు స్పష్టమైన లక్ష్యం, నిబద్ధత ఉందన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌కు తరలివస్తున్నారన్నారు. ఇండస్ట్రీకి ఇదో సువర్ణావకాశమని, దీన్ని మిస్ చేయవద్దని ప్రధాని మోదీ అన్నారు.