గ్రామాల్లో ఉన్న వారెవరయినా తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు వద్దనుకుంటే రాసి ఇవ్వమని చెప్పండి.. అంతేకానీ అర్థరహిత విమర్శలు చేయవద్దు అని టీడీపీని ఉద్దేశించి మంత్రి ధర్మాన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పథకాలు అమలు అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీనిని ఎవ్వరూ కాలరాయలేరని, తాము పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామ ని, ఎవ్వరైనా సరే .. వీటిని వద్దనుకుంటే లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాకే విమర్శలు చేయాలని, ఇందులో మధ్యవర్తులకు చోటే లేదని అన్నారు. అదేవిధంగా నాడు అమలులో ఉన్న జన్మభూమి లాంటి కమిటీలకూ, సంబంధిత ప్రలోభాలకూ తావేలేదని స్పష్టం చేశారు. ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, వాస్తవాలు తెలుసుకుని అప్పుడు విమర్శలు చేయాలి అని విపక్షానికి హితవు చెప్పారు. తాము అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఒక్కసారి పరిశీలించాలి అని, రెండు కళ్లతో చూసి , వాస్తవాలు బేరీజు వేసుకుని అటుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడాలని సూచించారు. అంపోలులో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గడిచిన మూడేళ్లుగా తాము అవినీతి లేని పాలన అందిస్తున్నామని, లంచాలు లేని పాలన అందిస్తున్నామని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే సంక్షేమ పథకాలకు సంబంధించిన మొత్తాలను అర్హతను అనుసరించి అందిస్తున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం, అంపోలు గ్రామంలో సచివాలయం – 1 పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా తీర్పు వెలువడి నేటి (మే 24)తో మూడేళ్లు కావస్తోందని, ఆ నాడు విపక్ష నేత హోదాలో పాదయాత్ర చేపట్టి రాష్ట్రం అంతా తిరిగి స్థానిక, బాధిత వర్గాల సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారం ఇచ్చే విధంగా నేడు జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని అన్నారు.
తొలుత గ్రామంలో పర్యటించి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో గడపగడపకు అందుతున్నాయని మంత్రి అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స జరిగిన జి.రాంబాబును పరామర్శించారు. వైద్య సాయం అందిన తీరు, ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితి తదితర వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చారు.యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, డిఆర్డీఏ పిడి శాంతి, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఎంపిపి గోండు రఘురాం, జెడ్పిటిసి మార్పు సుజాత, రాష్ట్ర నాటక అకాడమీ సభ్యులు ముంజేటి కృష్ణ, వైస్ ఎంపిపి బరాటం రామశేషు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గోండు కృష్ణ, అంబటి శ్రీనివాసరావు, ముకళ్ల తాతబాబు, సర్పంచ్ గోండు జయరామ్, యల్లా నారాయణ తదితరులు పాల్గొన్నారు