కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా నెలకొంది. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీఎంఆర్ చల్లటి కబురు చెప్పింది.
‘అమెరికాతో పోలిస్తే నాలుగైదు రేట్ల ఎక్కువ జనాభా ఉన్న దేశం మనది. నెల రోజుల్లో వ్యాక్సిన్ వేయటం సాధ్యం కాదు. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇతర మార్గాల నుండి కూడా దేశానికి వ్యాక్సిన్లు రాబోతున్నాయి… ఇవన్నీ కలిసి జూలై మధ్య నుండి కానీ ఆగస్టు మొదటి వారం నుండి కానీ రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఐసీఎంఆర్ చీఫ్ డా.బలరాం భార్గవ తెలిపారు. ఈ ఏడాది పూర్తయ్యే సరికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, కాస్త ఓపికతో ఉంటే మెరుగైన ఫలితాలు చూస్తామని ఆయన పేర్కొన్నారు.