Wednesday, November 6, 2024

Delhi | మేము ఏ కూటమిలో లేము.. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తాము అటు విపక్ష కూటమి ‘ఇండియా’, ఇటు అధికారపక్ష కూటమి ‘ఎన్డీఏ’.. రెండింటిలోనూ లేమని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. ప్రజల శ్రేయస్సును, ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో పెట్టుకుని అంశాలవారిగా తాము పార్లమెంటులో పోరాడుతున్నామని ఆయన వివరించారు. మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన సురేశ్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగిన మణిపూర్ హింసాకాండపై యావత్ ప్రపంచం చర్చించుకుంటోందని, ఇలాంటప్పుడు పార్లమెంటులో చర్చ జరిపి బాధితులకు భరోసా కల్పించాలని అన్నారు. తాము సిద్ధమేనని ప్రకటిస్తూనే చర్చ జరగనీయకుండా అధికారపక్షం వ్యవహరిస్తోందని సురేశ్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు సభ వెలుపల ప్రధాని మాట్లాడారని, తాము సభ లోపల మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

సంజయ్ సింగ్ సస్పెన్షన్ వెనుక కుట్ర

మరోవైపు సభలో బిజినెస్ పూర్తిగా సస్పెండ్ చేసి అత్యంత సున్నితమైన మణిపూర్ హింసాకాండపై చర్చ జరపాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులపై రాజ్యసభ ఛైర్మన్ వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్ సంజయ్ సింగ్ తానిచ్చిన వాయిదా తీర్మానం నోటీసులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఛైర్ దగ్గరకు వెళ్లి ప్రశ్నించినందుకు ఆయన్ను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఈ సస్పెన్షన్ వెనుక కుట్రకోణం దాగుందని ఆరోపించారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులను సభలో లేకుండా చేసి, తద్వారా ఆర్డినెన్సుకు చట్ట రూపం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే సస్పెండ్ చేసి, సభలో వ్యతిరేకించే సభ్యులెవరినీ లేకుండా చేసి అనేక బిల్లులు పాస్ చేసుకుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement