Tuesday, November 26, 2024

మేం తగ్గం.. చెప్పుకోతగ్గ ఫలితం సాధించబోతున్నాం : ఉక్రేయిన్..

కీవ్‌:అకారణంగా తమపై దండయాత్ర ప్రారంభించిన రష్యాను నిలువరించడంలోను, మాతృభూమిని, ప్రజలను కాపాడుకునేందుకు అటు సైన్యం, ఇటు ఉక్రెయిన్‌ సమాజం అసమాన ధైర్యసాహసాలతో పోరాడుతోందని, ఈ యుద్ధంలో అంతిమ విజేతలం తామేనని ఆ దేశ అధ్యక్షుడు వొలిదిమిర్‌ జెలెన్‌ స్కీ విశ్వాసం వ్యక్తం చేశారు. కీవ్‌పై రష్యా దాడిని అలాగే తిప్పికొట్టామని, ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బోస్‌ ప్రాంతంలో రష్యా దూకుడుగా వెడుతోందని, అయితే తిప్పికొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని, రష్యా ఎంత ప్రయత్నించినా తలొగ్గబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై వందరోజులు పూర్తయిన నేపథ్యంలో జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తూర్పు ఉక్రెయిన్‌ పరిధిలోని డాన్‌బోస్‌ ప్రాంతంలో రష్యా భీకరదాడులు చేస్తోందని, ప్రదాన నగరం సీవీరోడోనెట్‌స్కీలో 80 శాతం మేర స్వాధీనం చేసుకుందని ధ్రువీకరించారు. అయితే శుక్రవారం తమ దళాలు కొంత పురోగతి సాధించాయని, చిన్నపాటి విజయాలు సాధించాయని చెప్పారు. ఇక దక్షిణ భాగంలో రష్యా సేనలను తరిమికొట్టామని, అక్కడ తమదే ఆధిపత్యమని వెల్లడించారు. అక్కడ రష్యా పెద్దఎత్తున ప్రాణనష్టాన్ని చవిచూసిందని, ఆయుధ సంపత్తిని కోల్పోయిందని ప్రకటించారు.

డాన్‌బోస్‌లోని లిసిచాన్‌స్క్‌, బఖముత్‌ వంటి పట్టణాలపై రష్యా పట్టు సాధించిందని చెప్పుకొచ్చిన ఆయన లుషాంక్‌, డోనెట్‌స్క్‌ వంటి ప్రాంతాల్లోని ప్రజలను సైన్యంలోకి చేర్చుకుని ఎదురుదాడులు చేస్తోందని విమర్శించారు. యుద్ధం సుదీర్ఘకాలం సాగేలా రష్యా వ్యూహాలు రచిస్తోందని, అదే జరిగితే రష్యా పతనం తప్పదని, చరిత్రహీనురాలిగా నిలిచిపోతుందని అన్నారు. అమెరికానుంచి తమకు హిమ్‌సార్‌ వంటి అత్యాధునిక రాకెట్‌ వ్యవస్థలు రాబోతున్నాయని, అప్పుడు తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరించారు. సీవీరోడోనెట్‌స్క్‌ లో రష్యా దూకుడు పెరిగిందని, ప్రజలను వెళ్లిపోవాల్సిందిగా వారి సేనలు బెదరిస్తున్నాయని, అయితే ప్రజలు తిరగబడుతున్నారని ఆయన అన్నారు. కాగా దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌లో రష్యా స్థావరాలను ధంసం చేశామని ఉక్రెయిన్‌ రక్షణ విభాగాలు ప్రకటించాయి. రష్యా సేనలను తరమికొట్టి 8 కి.మి. భూభాగాన్ని తిరిగి సాధీనం చేసుకున్నామని తెలిపాయి. కాగా ఖార్కీవ్‌పై మరోసారి దాడి చేసేందుకు రష్యా సేనలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని, విధిలేని పరిస్థితుల్లో దక్షిణ ఉక్రెయిన్‌కు రష్యా అదనపు బలగాలను రప్పిస్తోందని, అందులో భాగంగానే 27 సాయుధ వాహనాలను రైళ్ల ద్వారా తరలించిందని తెలిపాయి. ఖేర్సన్‌లోని నొవొవొరొంట్‌సోవ్కాలో రష్యా ఫిరంగుల దాటిలో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. ఖేర్సన్‌లో స్థానికులకు రష్యా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ ప్రారంభించిందని ఆరోపించారు. మరోవైపు నైరుతిభాగంలోని మికోలయివ్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement