Friday, November 22, 2024

విశాఖ రైల్వేజోన్‌కు కట్టుబడి ఉన్నాం.. వదంతులు నమ్మొద్దు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం రైల్వే జోన్ సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిందని వచ్చిన కథనాలను (ఆంధ్రప్రభలో కాదు) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఖండించారు. అవి కేవలం వదంతులేనని, అలాంటి పుకార్లను విశ్వసించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం అనంతరం నిర్ణయాలను మీడియాకు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. ప్రత్యేక హోదాకు పట్టిన గతే విశాఖ రైల్వే జోన్‌కూ పడుతుందని, రైల్వే జోన్ ఏర్పాటుకు ఫీజిబిలిటీ లేదంటూ రైల్వే బోర్డు తేల్చిచెప్పిందని కొన్ని కథనాలు వెలువడ్డాయి.

దీంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సైతం ఇదంతా అవాస్తవమంటూ కొట్టిపడేశారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయ రెడ్డి ఏకంగా రాజీనామా సవాల్ విసిరారు. రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జోన్ ఏర్పాటు కోసం ప్రక్రియను వేగవంతం చేశామని, వీలైనంత త్వరగా పని పూర్తిచేస్తామని చెప్పారు. జోన్ కార్యాలయాల నిర్మాణం, తదితర అవసరాల కోసం భూమి కూడా అందుబాటులో ఉందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement