Friday, November 22, 2024

త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టుకు నీటి ట్రయల్ రన్.. రీ డిజైనింగ్​తో లక్ష ఎకరాలకు సాగునీరు : బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ కు తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని ట్రయల్ రన్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం గౌరవెల్లి ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్, ప్రభుత్వ ఇంజనీరింగ్ సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్ తో కలిసి వినోద్ కుమార్ సందర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల సాగునీటి కల త్వరలోనే సాకారం కానుందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ గోదావరి జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గ బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని వినోద్ కుమార్ తెలిపారు.

గోదావరి జలాలతో ఈ ప్రాంత బీడు భూములు పచ్చలహారం తొడగనున్నాయని వినోద్​కుమార్​ పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి మిడ్ మానేర్, అటు నుంచి తోటపల్లి రిజర్వాయర్ కు, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్ కు నీరు చేరుతుందని, భారీ మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కేవలం 1.141 టీ.ఎం.సీ. మాత్రమే ఉండగా, సీఎం కేసీఆర్ రీ – డిజైన్ చేయడం వల్ల ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 8.3 టీ.ఎం.సీలకు పెరిగిందని, తద్వారా లక్ష ఎకరాలకు సాగనీటిని అందించేందుకు ఆస్కారం కలిగిందని వినోద్ కుమార్ తెలిపారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్ 130 మీటర్ల లోతులో, 17 మీటర్ల వెడల్పు, 85 మీటర్ల పొడవుతో నిర్మించారని వినోద్ కుమార్ తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 90 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు తో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని 15 గ్రామాలకు, కోహెడ మండలంలోని 8 గ్రామాలకు, చిగురుమామిడి మండలంలో 10 గ్రామాలకు, భీమదేవరపల్లి మండలంలో 12 గ్రామాలు, ధర్మసాగర్ మండలంలో 13 గ్రామాలు, ఘన్ పూర్ మండలంలో 10 గ్రామాలు, సైదాపూర్ మండలంలో 3 గ్రామాలు, హనుమకొండ, జఫర్ ఘడ్, రఘునాథపల్లి మండలాల్లోని 5 గ్రామాలకు సాగునీరు అందుతుందని వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరనున్నట్లు ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement