ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పట్టు సాధిస్తే విజయం దక్కినట్టేనని భావించిన రష్యా ఆటలు సాగకుండా ఉక్రెయిన్‌లో ఓ పల్లె ప్రజలు చేసిన సాహసం ఇప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. వందలాది యుద్ధట్యాంకులతో వరుసకట్టి రాజధానిలోకి చొచ్చుకుపోవాలని భావించిన రష్యాకు అడ్డుకట్ట వేసేందుకు రాజధాని శివారులోని ఓ చిన్న పల్లెటూరు ప్రజలు తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. కీవ్‌నుంచి రష్యా సేనలు వెనకకు మళ్లేలా చేసిన ఆ పల్లె సాహసం ఇప్పుడు ఓ సంచలనంగా మారింది. సమీపంలోని ఓ నది నీటిని మోటార్లతో తోడి గ్రామంలో కృత్తిమ వరద సృష్టించి రష్యాను అయోమయంలోకి నెట్టేశారు. గ్రామమంతా ఓ చెరువులా తయారు చేసేశారు. వందలాది మోటార్లతో వారు నీటిని తోడి పొలాలు, రోడ్లు ఒకటేమిటి అంతటా నీరుండేలా చేశారు. దారితెన్నూ తెలీక, అయోమయంలో రష్యా సైనికులు ఆ గ్రామం బయటే ఉండిపోవాల్సి వచ్చింది. రోజుల తరబడి నిలిచిపోయిన యుద్ధట్యాంకుల కాన్వాయ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దళాలు దాడులు చేసి విధ్వంసం సృష్టించాయి. విధిలేక రష్యా సేనలు తిరుగుముఖం పట్టాయి. ఇది కీవ్‌కు సమీపంలోని డెమిదివ్ గ్రామస్థుల దేశభక్తికి తార్కాణంగా నిలిచింది. దాదాపు 65 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతున్నప్పటికీ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వేలాదిమంది సైన్యాన్ని, ఆయుధాలను, రక్షణ వాహనాలను కోల్పోయింది. ఉక్రెయిన్ వ్యూహాత్మక విజయాలు రష్యా వైఫల్యాల వెనుక డెమిదివ్ వంటి గ్రామాల సాహసం ఉంది. ఈ వరద వల్ల గ్రామం నాశనమవుతుందని, పంటలు దెబ్బతింటాయని, ఇళ్లలోకి బురద చేరుతుందని తెలుసు.. అయినా శత్రువును అడుగుపెట్టనివ్వకూడదనుకున్నాం.. మా మాతృభూమిని కాపాడుకునేందుకు ఎంత నష్టాన్నయినా భరించాలనుకుని కృత్రిమ వరదను సృష్టించామని డెమిదివ్ గ్రామస్థులు సగర్వంగా చెప్పుకుంటున్నారు. మార్చిలో జరిగిన ఈ ఉదంతం గురించి న్యూయార్క్ టైమ్స్‌లో కథనం ప్రచురితమైంది. నదినుంచి నీటిని తోడుతున్న ఛాయాచిత్రాలు, వీడియోలను ఆ పత్రిక విడుదల చేసింది. డెమిదివ్ తరహాలోనే అనేక గ్రామాల ప్రజలు తాము నష్టపోయినా దేశాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఆహార ధాన్యాలను దోచుకుంటున్న రష్యా..
యుద్ధనేరాలకు పాల్పడుతున్న రష్యా చివరకు ఉక్రెయిన్ రైతులు పండించిన ఆహార ధాన్యాలనూ ఎత్తుకుపోతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ప్రత్యేకించి ఖేర్సన్ ప్రాంతంలో రష్యా పంటలను తరలిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ రాతపూర్వక ప్రకటనను విడుదల చేసింది. అదేమాదిరిగా ఉక్రెయిన్‌కు ఆహార పదార్థాలతోవస్తున్న నౌకలను అడ్డుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజల ఆహారభద్రత హక్కును కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించిన రష్యా.. పంటల తరలింపుపై తమవద్ద సమాచారం లేదని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..