ప్రభన్యూస్, హైదరాబాద్ : మండుతున్న వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు భాగ్యనగరం ‘మంచినీరు మహాప్రభో’ అంటూ ఘోష పెడుతోంది. మహానగరంలో పెరుగుతున్న జనాభాకు సరపడా తాగునీటి సరఫరా లేదు. గతంలో కురిసిన వర్షాలతో జలాశయాల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నా.. అదిగో కృష్ణమ్మ సవ్వడులు.. ఇదిగో గోదావరి పరవళ్లు అంటూ.. ఎన్నికైన పాలకులు ప్రజలకు ఎండమావులు చూపిస్తున్నారు. టక్కుటమారా విద్యలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠధామం చూపిస్తూ.. వేసవి వచ్చే సరికి నీటి సరఫరాపై మల్లగుల్లాలు పడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వేసవిలో మహా మంచినీటి సమస్యతో జనం గుక్కెడు నీళ్లు దొరక్క గుండెలు బాదుకుంటున్నారు. సామాన్య, మధ్య, పేద వర్గాలకు చెందిన ప్రజలు దాహార్తిని తీర్చుకునేందుకు ప్రైవేట్ వాటర్ఫిల్టర్లు, వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తుండటం గమనార్హం. విశ్వనగరం అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన ప్రణాళికలు పట్టాలెక్కడం లేదు. ప్రస్తుతం మంచినీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. మహానగరంలో జనాభా అంతకంతకూ పెరుగుతూ ప్రస్తుతం కోటికి పైగా దాటిందనే అంచనాలున్నాయి. అయితే తాగునీటి పైప్లైన్ల విస్తరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. కోర్‌సిటీలో నిజాం నాటి పైప్‌లైన్ వ్యవస్థపైనే ఆధారం.
దీనికి తోడు ప్రస్తుతం ఉన్న నీటి కనెక్షన్లకు సరిఫరా తాగునీటి సరఫరా చేయడం వాటర్‌బోర్డుకు కత్తిమీద సాములా మారింది. గ్రేటర్ దాహం తీరుస్తున్నా.. కృష్ణ మూడుదశలు, గోదావరి మొదటి దశ ప్రాజెక్టులతో పాటు సింగూరు, ఉస్మాన్, హిమాయత్‌సాగర్ జలాశ యాల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నా.. సరఫరా మాత్రం ప్రతినిత్యం (12.04.22) 509.91 ఎంజీడీలకు సరఫరా చేస్తుండటం గమనార్హం. ఇందులోనే కోర్‌సిటీతో పాటు ఓఆర్ఆర్ లోపలున్న ప్రాంతాలకు సైతం తాగునీటిని వాటర్‌బోర్డు అందిస్తున్న సంగతి తెలిసిందే. అరకొర నీటి సరఫరాతో ప్రతి సంవత్సరం వేసవిలో మహానగరంలో మంచినీటి కష్టాలు షరా మామూలుగా మారాయి.
శివారులో దాహం..దాహం..!
ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని మున్సిపాల్టిలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు మంచినీటిని అందించేందుకు రూ.1,200 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులను వాటర్‌బోర్డు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ప్యాకేజీ-2లో మొదటి ప్రాధాన్యత కింద నిర్ణయించిన 73 కాలనీల్లో 116.7 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ విస్తరణ పనులు గత నెల 31 నాటికి పూర్తి చేసి, ఏప్రిల్ రెండో వారంలో మంచినీటి సరఫరా ప్రారంభించాలనే అధికారుల ప్రయత్నాలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఏప్రిల్ మాసంలో నీటిసరఫరా చేయాలని నిర్ణయించినా అది అమలు కావడం లేదు. ఏప్రిల్ మాసంలోనే నీటి కష్టాలు రెట్టింపు అయ్యాయి. రానున్న మే మాసంలో పరిస్థి తులు తీవ్రంగా ఉండే ప్రమాదం లేకపోలేదు. ఎండలు ముదురుతుండటంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ఎక్కు వ డబ్బులు కర్చు చేసి ప్రైవేట్ ట్యాంకర్లను వినియోగించుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో నీటిస రఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మినరల్, ప్రైవేట్ ట్యాంకర్లకు వెతుకులాట..!
ఇటు కోర్‌సిటీతో పాటు, అటు శివారు ప్రాంతాల్లోని ప్రజలు దాహార్తి కోసం స్థానికంగా ఉండే వాటర్ ఫిల్టర్లపై ఆధారపడుతున్నారు. 20 లీటర్ల మినరల్ వాటర్‌కోసం రూ.10, అదే చల్లనినీరు అయితే రూ.20 చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. 12 వేల లీటర్ల ట్యాంకర్లు రూ.2వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వాటర్‌బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల ధర తక్కువగా ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నా లభ్యత లేకపోవడంతో.. ప్రైవేట్ ట్యాంకర్లను ప్రజలు ఆశ్రయిస్తుండటం గమనార్హం. వాటర్‌బోర్డు సరఫరా చేసే పది వేల లీటర్ల ట్యాంకర్‌కు గృహా అవసరాలకు అయితే రూ.1050, కమర్షియల్ కోసం రూ.1700 చెల్లిస్తున్నారు. అదే విధంగా మరో 20 వేల లీటర్ల ట్యాంకర్ కోసం కమర్షియల్ కోసం రూ.3400 ధరను చెల్లించాల్సి వస్తోంది. ఎందుకంటే చాలామంది అద్దెలు వచ్చేలా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వేసవి కాలంలో శివార్ల పరిధిలో సగానికి పైగా బోర్లు ఎండిపోతాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. చాలా డబ్బులు నీటికే సరిపోతుండటంతో ఇంటి యజమానులు ఆందోళన చెంబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒకరకంగా మున్సిపాల్టిలు, కార్పొరేషన్ల పరిధిలో మరో రకంగా వాటర్‌బోర్డు నీటి సరఫరా చేస్తుండటం గమనార్హం.