Friday, November 22, 2024

Water – బెంగళూరులో తాగునీటి సంక్షోభం ..

మా ఇంట్లో బోరు ఎండిపోయిద‌న్న డికె..
సిలికాన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా పేరున్న కర్ణాటక రాజధాని బెంగళూరులో తాగునీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్లు ఎండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు.

నీటిని వృథా చేయొద్దు..
నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి నెలకొందని, తన ఇంట్లోని బోరు కూడా ఎండిపోయిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నగర ప్రజలకు నీరు అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయకండి అంటూ ప్రజలకు సూచించారు. ‘ప్రస్తుతం భయంకరమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నగర ప్రజలకు నీరు సరఫరా చేస్తాము’ అని స్పష్టం చేశారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా..
వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావులు ఎండిపోవడంతో బెంగళూరు నగరం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ నీటి సంక్షోభాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక ప్రైవేటు వాటర్‌ ట్యాంకర్లు నీటి పంపిణీ కోసం నివాసితుల నుంచి విపరీతంగా ఛార్జ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై కూడా డిప్యూటీ సీఎం మాట్లాడారు. నీటిని సరఫరా చేసేందుకు కొన్ని ప్రైవేటు ట్యాంకర్లు రూ.600 ఛార్జ్‌ చేస్తుంటే.. మరికొన్ని రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ధరలను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ట్యాంకర్లు అన్నీ అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. దూరాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో పలు హౌసింగ్‌ సొసైటీలు నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేస్తే భారీ జరిమానా తప్పదంటూ ఇప్పటికే పలు హౌసింగ్ సొసైటీలు తమ నివాసితులకు హెచ్చరికలు జారీచేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement