Monday, November 18, 2024

ఇక్కడే స్థిరపడతా… విశాఖ పౌరుడినవుతా…

బీచ్‌ రోడ్‌లో స్థలం కొన్నా
త్వ‌రలో ఇల్లు కట్టుకుంటా
విశాఖవాసులు విశాల మనస్కులు
వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి

విశాఖపట్నం,ప్రభన్యూస్‌:విశాఖపట్నమంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడే స్థిరపడతానని మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటిం చారు. విశాఖకు సమీపంలోని భీమిలిలో స్థలం కొన్నానని, త్వరలో ఇల్లు కట్టుకుని నేనూ విశాఖవాసిని అవుతానని వెల్లడించారు. వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌ లో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా హీరో చిరంజీవి మాట్లాడుతూ, ఎప్పుడు విశాఖ వచ్చిన ఏదో ఉద్వేగానికి గురవుతానని, విశాఖ నగరం స్వర్గధామమని అభివర్ణించారు. ఇక్కడ ఇల్లు కట్టుకుని హాలిడే హోమ్‌గా గడపాలనే తన చిరకాల వాంఛను వ్యక్తం చేసారు. ఇక్కడి ప్రజలు విశాల మనస్కులని, హుందాగా ఉంటారని, సినిమాలను బాగా చూసి ప్రేమిస్తారని అన్నారు. ఓర్పు కలిగిన వీరి మధ్య సొంతగా ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడి విశాఖ పౌరుడిగా ఉంటానని ఆయన ప్రకటిం చారు. వాల్తేర్‌ వీరయ్య టైటిల్‌ వినాగానే నాకు నచ్చిందని చెప్పిన ఆయన ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. కష్టపడి పనిచేసిన యూనిట్‌ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకూ నచ్చేలా దర్శకుడు బాబీ సినిమాని తీసారని చెప్పారు. సాయంత్రం ఎనిమిది ఇర వై నిమషాలకు వేదికపైకి వచ్చిన ఆయన రాత్రి పదిన్నర గంటలకు తన ప్రసంగం ముగించారు.
హిట్‌ ఖాయం – రవితేజ
హీరో రవితేజ మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా హిట్‌ కాబోతున్నదని, ముందుగానే అందరికీ అభినందనలు అన్నారు. చిరంజీవి ‘విజేత’ సినిమా ఫంక్షన్‌ను విజయవాడ లో దూరంగా ఉండి చూసానని, ఆయనతో కలిసి నటించే అద్భుతమైన మంచి క్షణం ఇప్పుడొచ్చిందన్నారు. ఎవ్వరినీ బాధపట్టని చిరంజీవి తాను ఇంకెవ్వరివల్లనైనా బాధపడ తారన్నారు. డైరెక్టర్‌ బాబీ ‘బలుపు’ సినిమాతో పరిచయం అయిన మంచి దర్శకుడు అన్నారు. సంక్రాంతికి వాల్తేరు వీర్రాజు మంచి సూపర్‌ బ్లాక్‌బ్లస్టర్‌ మూవీ కాబోతున్న దన్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ చిరంజీవి సినిమాలు చూసి పెరిగిన తాను, ఆయనను డైరెక్టు చేయడం ఆనందంగా ఉందన్నారు. ‘డోంట్‌ స్టాప్‌ డాన్సింగ్‌ పూనకాలు లోడింగ్‌’ అన్నట్లుగా సినిమా అందరినీ మెప్పిస్తుందన్నారు. రెండేళ్ల పాటు సినిమా తీసినా.. తృప్తికరంగా వచ్చిందన్నారు. చిరంజీవికి రాజకీయాలు పడవని, అవి చూసుకునేందుకు తమ్ముడు పవన్‌ కళ్యాన్‌ ఉన్నాడని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఒక్కరే మెగాస్టార్‌ అని చెప్పిన, ఆయన చిరంజీవి మాత్రమేనని అన్నారు. సుమ యాంకర్‌ గా వ్యవహరించిన కార్యక్రమంలో సత్య మాస్టర్‌ బృందం వాల్తేరు వీరయ్య సినిమాలోని కొన్ని పాటలకు నృత్యాలు చేసారు. మైత్రీ ఫిలింస్‌ అధినేత రవి, హీరోయిన్స్‌ కేతరిన్‌, ఊర్వశి, కాస్ట్యూమర్‌ సుస్మిత, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌, సంగీత దర్శకుడు డీఎస్పీ, నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌, సహనటులు శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్‌, సప్తగిరి తదితరులు కార్యక్రమంలో భాగం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement