హైదరాబాద్, ఆంధ్రప్రభ: వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన హెల్త్ సిటీ పనులు వేగవంతం చేసేలా వైద్యారోగ్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లి ఎన్నికల లోగానే ఆస్పత్రి నిర్మాణ పనులను పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తరువాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌ను హెల్త్ సిటీగా మార్చాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగా వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో అత్యంత ఆధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హెల్త్ సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1100 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు కూడా జారీ చేసింది.
56 ఎకరాల స్థలంలో మొత్తం 24 అంతస్తుల్లో 2000 పడకలతో నిర్మించే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి స్వయంగా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియను సైతం పూర్తి చేసి శరవేగంగా పనులు ప్రారంభించింది. దీంతో ఇప్పటికే దాదాపు సగం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్నది దవాఖాన మాత్రమే కాదు… ప్రభుత్వ రంగంలో దేశంలో ఏర్పాటు చేస్తున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీగా వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇది పూర్తయితే వరంగల్ పరిసర జిల్లాల ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. వరంగల్ కూడా వైద్యవిద్య పరిశోధనలకు కేంద్రంగా నిలువనుందని స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రి హరీష్ రావు సందర్శించిన సందర్భంగా మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించిన పరికరాలను ముందుగానే కొనుగోలు చేస్తామనీ, వైద్య, వైద్యేతర సిబ్బందిని సైతం ముందుగానే నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి మరో మూడు నెలల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సూచనలు ఇస్తున్నారు. కాగా, ఒకటి రెండు రోజుల్లో వరంగల్ హెల్త్ సిటీ పనులను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా పరిశీలించనున్నట్లు సమాచారం. ఈమేరకు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. వరంగల్ హెల్త్ సిటీ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి హరీష్ రావు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశముంది.